నార్నూర్/ఇంద్రవెల్లి/ఎదులాపురం, జనవరి 19 : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన ఆదివాసులు 80 మంది వరకు మహారాష్ట్రలోని జంగుబాయి దర్శనానికి ఆదివారం డీసీఎం వాహనంలో బయలుదేరారు. నార్నూర్ మండలంలోని మాల్కుగూడ మూలమలుపు వద్ద వాహనం అదపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొమ్మిది అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాల్లో నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందులోనుంచి కొందరి పరిస్థితి మరింత విషయమంగా ఉండడంతో రిమ్స్‌కు తీసుకెళ్లారు. రిమ్స్‌లో కుమ్ర మలు, కుమ్మర రాంబాయి, మేస్రం నాని, కుమ్రం భీంరావు, జంగుబాయిలు చికిత్స పొందుతున్నారు. ఇందులో కుమ్ర మల్కు(61) తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.