యాదాద్రి భువనగిరి : జిల్లా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భువనగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవే లక్ష్యంతో వ్యక్తిగత పనులున్నా ఏండ్లుగా కాంగ్రెస్ కేడర్ కాపాడుకుంటూ వస్తున్నానని తెలిపారు.
పార్టీ కోసం పాటుపడే తనను, కార్యకర్తలను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం..కార్యకర్తలను మనోభావాలను దెబ్బతీయడం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ రాజకీయాల గురించి చర్చించడానికే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.