హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): అక్రమంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని ఆరుగురు హోల్‌సేల్ మందుల వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్‌రెడ్డి సోమవారం తెలిపారు. మొత్తం రూ.51.92 లక్షల విలువైన మందులను సీజ్ చేశామని, నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని, నివేదిక ఆధారంగా 30 రోజులపాటు లైసెన్సులను రద్దు చేసినట్టు తెలిపారు.
ఈ ఏడాది మార్చి 15-25 తేదీల మధ్య ఆరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై దాడులు చేసినట్టు తెలిపారు. ఆయా దుకాణాల్లో ఎలాంటి పర్చేజ్ బిల్లులు లేకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసినట్టు గుర్తించామని పేర్కొన్నారు. వారు వీటిని న్యూఢిల్లీ నుంచి తెప్పించినట్టు గుర్తించామని, 40 శాతం డిస్కౌంట్‌కు వారు ఇక్కడ అమ్ముతున్నట్టు తేలిందని తెలిపారు.