హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై బుధవారం దాడులు నిర్వహించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ షెహనాజ్ ఖాసీం తెలిపారు. యాంట్రీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు వివరించారు. దాడుల్లో మెడికల్ షాపులు యాంటీ బయాటిక్స్ను యథేచ్చగా విక్రయిస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు. యాంటీ బయాటిక్స్ విక్రయాల్లో నిబంధనలు పాటించని 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
ఆయా మెడికల్ షాపులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారని, బిల్లులు సైతం ఇవ్వడం లేదని వాపోయారు. ఏఎంఆర్ అంతర్జాతీయ ఆరోగ్య విపత్తుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. 10 ప్రధాన ప్రజారోగ్య ముప్పుల్లో ఏఎంఆర్ ఒకటి అని వివరించారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ కారణంగా 12.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. యాంటీ బయాటిక్స్ను దుర్వినియోగం చేస్తే ఆరోగ్యానికి ముప్పు తప్పదని ప్రజలను హెచ్చరించారు.