హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయాలంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (డీబీఎం) ఒక్కటే శరణ్యమని టెక్నికల్ కమిటీ నియమించిన సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించి ఆ దిశగా ముందుకు పోవాలని సూచించినట్టు సమాచారం. కొద్ది నెలల క్రితం ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగం కుప్పకూలిపోయి, ఎనిమిది మంది మృతిచెందిన నేపథ్యంలో సొరంగం పనులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటుచేసింది.
ఆ కమిటీ ఎన్జీఆర్ఐ, టన్నెల్ ఎక్స్పర్ట్ తదితర నిపుణులతో మరో సబ్‌కమిటీని ఏర్పాటుచేసింది. ఆ సబ్ కమిటీ సభ్యులు శుక్రవారం వర్చువల్‌గా భేటీ అయ్యారు. ప్రమాదంలో సొరంగంలోని టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) పూర్తిగా ధ్వంసమైంది. టీబీఎంతో ముందుకు వెళ్లలేమని కూడా సబ్‌కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు పనులను చేపట్టేందుకు ముందుకుపోవాలని ఇటీవలనే అధికారులను ఆదేశించించింది. ఈ నేపథ్యంలో పలు విభాగాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు జలసౌధలో శుక్రవారం సమావేశమై, పునరుద్ధరణ పనులపై ఏవిధంగా ముందుకుపోవాలనే అంశంపై చర్చించినట్టు తెలుస్తున్నది. ఆయా మరమ్మతు పనులకు సంబంధించిన డిజైన్లను ఇచ్చేందుకు సీడీవో విముఖత చూపినట్టు సమాచారం. సీడబ్ల్యూసీ సైతం అందుకు ససేమిరా అంటునట్టు తెలిసింది.