హైదరాబాద్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరికి( MLA Kadiyam Srihari) సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యను సోమవారం హనుమకొండలోని వారి ఇంటి వద్ద అక్రమ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్యను ఇంటికి వెళ్లి కలిశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పై గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం ఏ విలువలకు నిదర్శనమని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతికత ఉన్నా కడియం శ్రీహరి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కడియం శ్రీహరి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని, నీతి వాక్యాలు వల్లించే కడియం శ్రీహరి అవినీతి చక్రవర్తి అని విమర్శించారు. బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం అవకాశమిచ్చి ఆదరించిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారన్న విషయంపై ఆయన మాట్లాడుతున్న తీరు ఊసరవెల్లిని మించుతోందని ఎద్దేవా చేశారు. రాజన్న పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ ఘన్పూర్ గడ్డపై గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని అన్నారు. కడియం శ్రీహరి బూటకపు ఎన్కౌంటర్లు చేసిన నరరూప రాక్షసుడు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.