నయీంనగర్, మే 31 : కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శనివారం బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం (ఏకశిల పారు) ఎదుట కార్మిక సంఘాల తో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిరువ్యాపారుల కుటుంబాలను వేధించడాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో వీధివ్యాపారులకు అనేక రుణాలు అందించి, వెండింగ్ జోన్లు ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. 2014లో తీసుకొచ్చిన చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక శాఖకు మంత్రిని నియమించకపోవడం కార్మికులపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. జూన్ 9న దేశ వ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.