నుమకొండ, జూలై 4 : అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని మండిపడ్డారు.
రుణమాఫీ చేయలేక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు బీఆర్ఎస్ కార్యాలయాలకు వస్తుండడాన్ని చూసి ఓర్వలేకనే కార్యాలయాలను కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నగరంలోని సర్వేనంబర్ 1066లో ఎకరం భూమిని బీఆర్ఎస్ 4,84,000కు ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేసి, పార్టీ కార్యకలాపాలకే వాడుతున్నదని తెలిపారు.
బీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు కేటాయించిన భూమిని క్యాన్సిల్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బల్దియా డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, వారు పంపిన నోటీసుకు వివరణతో కూడిన సమాధానం బుధవారం డిప్యూటీ కమిషనర్‌కు అందజేశామని తెలిపారు. కేసులకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్, సీపీఐ, సీపీఎం, టీడీపీ కార్యాలయాలకు భూమిని కేసీఆర్ రాకముందే కేటాయించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఇటుక పెళ్ల కదిపినా గాంధీభవన్‌ను కూల్చుతామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి జీవోను అప్పుడున్న ప్రభుత్వ నామినల్ రేట్ ప్రకారం ఇచ్చిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాల భూమిని రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు అదే జీవోను అనుసరించి కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కూడా మున్సిపాలిటీ భూమిలో కట్టించామని తెలిపారు. పార్టీ కార్యాలయాన్ని టచ్ చేస్తే, మీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రా బ్యాంకుకు, కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా ఆఫీసును పెళ్లిళ్లకు కిరాయికి ఇస్తున్నారని, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కమర్షియల్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ పాల్గొన్నారు.