రవీంద్రభారతి, జూలై 22 : త్వరలో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ కీర్తికి ప్రతీకగా దాశరథి కృష్ణమాచార్య విగ్రహం ప్రతిష్టించే కార్యాచరణను ప్రారంభిస్తామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో భాషా సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రచయిత దేవేందర్‌కు దాశరథి అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ నేలపై ఉద్యమించిన సాహితీ కిరణం దాశరథి కృష్ణమాచార్య అని కొనియాడారు. రాష్ట్రంలోని పన్నెండు వేలకుపైగా ఉన్న గ్రామ పంచాయతీల్లో దాశరథి రచనలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. యువత కోసం క్రీడల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా మరో కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దాశరథి తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి అన్నారు. ఆయన ప్రభావంతో ఎందరో రచనలు చేశారని, అందులో దాశరథి అవార్డు గ్రహీత దేవేందర్ ఒకరని తెలిపారు. రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ, దాశరథి తనయుడు లక్ష్మణ్, కుమార్తె పాల్గొన్నారు.