యాదాద్రి, మార్చి 18 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ అనంతరమే స్వయంభువుల దర్శనాలు ఉంటాయని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ సమయంలో భక్తులకు అనుమతి ఉండదన్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగాలను ప్రారంభిస్తామని చెప్పారు. శుక్రవారం ఆమె యాదాద్రిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 27 వరకు రోజూ పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. బాలాలయంలో ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతాయని, 28న ఉదయం పూర్ణాహుతి అనంతరం మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని వివరించారు. మహా సంప్రోక్షణలో 125 మంది రుత్విక్కులు, పారాయణీకులు పాల్గొంటారని, రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి వీరంతా ఆదివారం సాయంత్రానికి యాదాద్రికి చేరుకొంటారని చెప్పారు. మూల మంత్ర జపాలు, పారాయణాలు, ఇతర కార్యక్రమాలు ప్రధానార్చకుల నేతృత్వంలో కొనసాగుతాయని, బాలాలయంలో నిర్వహించే యాగాలను భక్తులు దర్శించుకోవచ్చని సూచించారు. ప్రధానాలయంలో సంప్రోక్షణ, నృసింహ మంత్ర జపాలు 108 మంది రుత్విక్కులతో చేపట్టనున్నట్టు వివరించారు. 27వ తేదీ వరకు బాలాలయంలో సువర్ణమూర్తుల దర్శనాలను భక్తులకు కల్పిస్తామని చెప్పారు. 28వ తేదీ ఉదయం స్వామివారికి పూర్ణాహుతి, యాగఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలోని సువర్ణమూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయానికి తీసుకొస్తామన్నారు. 11.55 గంటలకు జరిగే మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ప్రధానాలయంలో సువర్ణమూర్తులను వేంచేపు చేసి, పూజా కైంకర్యాలు పూర్తయిన వెంటనే స్వయంభువుల దర్శనాలు ప్రారంభిస్తామని తెలిపారు.
కొండపైకి బస్సుల ట్రయల్న్ ఈ నెల 25న నిర్వహిస్తామని, 28వ తేదీలోపు బస్సులు అందుబాటులోకి వస్తాయని ఈవో గీత తెలిపారు. 28న దర్శనాలు ప్రారంభమైన అనంతరం కొండపైకి 75 బస్సులను నడిపిస్తామని ఆమె పేర్కొన్నారు. కొండకింద బస్బే నుంచి బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. కొండపై రద్దీ ఎక్కువైతే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసి, రద్దీ తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు జియో ట్యాగింగ్ ఉంటుందని, దీంతో ఎంతమంది భక్తులు దర్శనానికి వస్తున్నారో తెలుస్తుందన్నారు. కల్యాణకట్ట, పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు దీక్షాపరుల మండపంలోని ఓ హాలులో భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.