హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది. భద్రతా చర్యలకు సంబంధించిన కార్యాచరణపై 21వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ సౌత్ రీజినల్ డైరెక్టర్ గిరిధర్ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్కు బుధవారం లేఖ రాశారు. ఆనకట్టల భద్రత చట్టంలో భాగంగా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్స్ (డీఎస్ఆర్పీ) ఆయా ప్రాజెక్టులను ప్రతి వర్షాకాలం ముందు, ఆ తరువాత తనిఖీ చేసి అందుకు సంబంధించిన నివేదికలను ఎన్డీఎస్ఏకు సమర్పిస్తాయి. అందులో భాగంగా ఓ బృందం మంజీరా నదిని తనిఖీ చేసి, నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన ఎన్డీఎస్ఏ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సింగూరు డ్యామ్ అంత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని హెచ్చరించింది.
డ్యామ్ ఎగువ వాలుపైనున్న రివెట్మెంట్తోపాటు, ఎఫ్ఆర్ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్మెంట్ దెబ్బతిన్నదని వివరించింది. పారాపెట్ గోడకు ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యామ్ పైభాగంలో పగుళ్లు ఉన్నాయని, గోడ కూడా ఎగువ వైపునకు వంగిపోయి ఉన్నదని వెల్లడించింది. ఆనకట్ట వాస్తవ డిజైన్ ప్రకారం రిజర్వాయర్ స్థాయిని 517.8 మీటర్ల వరకు ఆపరేట్ చేయవచ్చని, కానీ మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని 522 మీటర్లు కంటే ఎకువగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వాన్ని అది దెబ్బతిస్తున్నదని వెల్లడించారు. డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దాని భద్రతకు తగిన చర్యలను తక్షణం చేపట్టాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. సింగూరు దిగువన నిజాంసాగర్ కూడా ఉందని, ఈ నేపథ్యంలో తక్షణం భద్రత చర్యలు చేపట్టాలని సూచించింది. డ్యామ్ సేఫ్టీ యాక్టు 2021 నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించి తక్షణం డ్యామ్ మరమ్మతు, పునరావాస పనులను చేపట్టాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించాలని ఈఎన్సీకి సూచించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను 21వ తేదీలోగా తమకు సమర్పించాలని ఎన్డీఎస్ఏ రీజినల్ డైరెక్టర్ గిరిధర్ ఆ లేఖలో స్పష్టం చేశారు.