హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ఫిరాయింపు చట్టం ప్రయోగించక ముందే తాను రాజీనామా చేస్తానని, కానీ ఉపఎన్నికల్లో మళ్లీ పోటీ చేయబోనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుదారుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలని కోరినట్టు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గానికి పార్టీ సూచించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపిస్తానని, అజారుద్దీన్‌కు ఇచ్చినట్టే తనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు తనకు మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేశానని దానం గుర్తుచేసినట్టు సమాచారం.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టపరమైన తుది నిర్ణయాన్ని నాలుగు వారాల్లో తేల్చాలని, లేదంటే న్యూఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం శాసనసభ స్పీకర్‌కు చేసిన హెచ్చరికలు చలికాలంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో గోడ దూకిన ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరు, లేదా ముగ్గురు మీద వేటు వేసి సుప్రీంకోర్టుకు నివేదించాలని స్పీకర్ కార్యాలయం ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తయ్యింది. ఇటీవల రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల మౌఖిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. నోటీసులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వచ్చిన మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం ఆగమేఘాల మీద నోటీసులు జారీచేసింది. ఈ నెల 23న హాజరుకావాలని నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను శరణుజొచ్చారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలిశారు. తన రాజకీయ జీవితాన్ని గట్టెక్కించాలని ప్రాధేయపడినట్టు తెలిసింది. సాంకేతిక, భౌతిక ఆధారాలపరంగా ఏరకంగా చూసినా.. ఫిరాయింపు చట్ట ప్రకారం తనపై వేటు తప్పదని, స్పీకర్ వేటు వేయడానికంటే ముందే రాజీనామా చేస్తే వ్యక్తిగతంగా తనకు, రాజకీయంగా పార్టీకి గౌరవంగా ఉంటుందని దానం నాగేందర్ ఏఐసీసీ పెద్దలకు వివరించినట్టు తెలిసింది. తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులపై కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ మీరు గెలిచే అవకాశాలు లేవా? అని ఏఐసీసీ ఆయన్ను అడిగినట్టు తెలిసింది. తప్పకుండా గెలుస్తానని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడంతో రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉన్నదని, తాను కూడా విజయం సాధిస్తానని దానం నాగేందర్ చెప్పినట్టు తెలిసింది. కానీ, 2004లో టీడీపీ నుంచి గెలిచిన తనను అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో చేరానని, టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే ఓటమి పాలయ్యానని గుర్తుచేసుకున్నట్టు తెలిసింది. అదే పునరావృతమైతే తన రాజకీయ జీవితం తెర మరుగైపోతుందని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఖైరతాబాద్ నుంచి చాలామంది పార్టీ నేతలు టికెట్ ఆశిస్తున్నారని, అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని దానం మాట ఇచ్చినట్టు తెలిసింది. తాను కూడా పోటీకి సిద్ధమేనని, తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రివర్గంలో చోటుకల్పించే అవకాశాన్ని పరిశీలించాలని అధిష్ఠానాన్ని దానం కోరినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దానంకు అధిష్ఠానం ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం.
ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఫిరాయింపు ఫిర్యాదుకు పూర్తిస్థాయి వివరణ, ఆధారాలు సిద్ధంచేసుకోవడానికి తనకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను వేడుకున్నట్టు తెలిసింది. అందుకు సంబంధించిన లేఖను కూడా స్పీకర్‌కు అందజేసినట్టు సమాచారం. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. మరికొంత సమయం ఇచ్చి ఆయనకు మరోసారి నోటీసులు పంపాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించినట్టు సమాచారం.