Dana Kishore | హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : ‘రెండు నెలల క్రితం డ్రోన్ సర్వే చేయగా మూసీ నది బఫర్జోన్లో 10,660 నివాసాలున్నట్టు గుర్తించాం.. వీళ్లందర్నీ 14 ప్రాంతాలకు తరలించి పునరావసం కల్పిస్తు న్నాం. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 50 కుటుంబాలను తరలించాం. విద్యార్థులకు స్కూల్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం.. ప్రభుత్వం కూలగొట్టాలనుకుంటే ఎప్పుడో కూలగొట్టేది..కానీ వారి అంగీకారం తర్వాతే కూలగొడుతున్నం. అందర్నీ సమ్మతితో తరలించడమే డెడ్లైన్..ఎప్పటికైనా కూల్చివేతలు తప్పవు’ అని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఎండీ దాన కిశోర్ స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ, ప్రజల తరలింపు అంశాలపై సచివాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూసీ నదిలో మంచినీళ్లు పారించి.. నగరానికి జీవనదిగా మార్చడమే సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష అని, ఇందులో భాగంగానే రూ.10 వేల కోట్లతో రెండు నెలల్లో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
పునరావాసానికి సరిపడా ఇండ్లు లేవు
మూసీ పరీవాహ కం నుంచి తరలించే వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్న దాన కిశోర్.. మరోవైపు అవసరమైన ఇండ్లు లేవని తెలిపారు. బాధితులు 10వేలకు పైగా ఉంటే నాలుగైదు వేల ఇండ్లే ఉన్నాయని చెప్పారు. 15వేల ఇండ్ల నిర్మాణానికి అనుమతి తీసుకున్నామని, రూ.700 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ అనుమతులు..
ఇండ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు కచ్చితంగా వ్యాలిడ్ అవుతాయని దానకిశోర్ స్పష్టం చేశారు. అక్కడక్కడా తప్పులు జరుగుతాయని, అయినా ఆ అనుమతులను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కొన్ని తప్పిదాల వల్ల బఫర్, ఎఫ్టీఎల్లోనూ ఇండ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారని, వీటిపై ఏం చేయాలనేది ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపారు. ఇక పై అనుమతుల్లో తప్పిదాలు జరగకుండా టీజీబీపాస్లో కెమెరాతో ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించే అధునాతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు.
వెబ్సైట్లో బఫర్, ఎఫ్టీఎల్ వివరాలు
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అసలు నగరంలోని చెరువుల పరిధిపై స్పష్టత ఉన్నదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందించిన దాన కిశోర్.. ఓఆర్ఆర్ లోపల 560 చెరువులు ఉంటే వీటిలో 503 చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ పరిధి గుర్తిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఓఆర్ఆర్ బయట 2,693 చెరువులు ఉంటే వీటిలో 2,052 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. వీటి వివరాలన్నీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు.
పట్టా భూములకు డబుల్ పరిహారం..
పట్టా భూములు ఉన్నవారికి మార్కెట్ వాల్యూకు రెట్టింపు పరిహారం ఇస్తామని, బహుళ అంతస్థుల కట్టడాలుంటే ఆ విలువ కూడా చెల్లిస్తామని, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారికి వేర్వేరుగా పరిహారం ఇచ్చే అంశంపై చర్చిస్తున్నామని దానకిశోర్ తెలిపారు. ఎంజీబీఎస్ వద్ద మూసీలోనే ఉన్న మెట్రో దారిపై ఫిర్యాదు వచ్చిందని, దీనిపై ప్రభుత్వం చర్చిస్తున్నన్నట్టు తెలిపారు.