ఖైరతాబాద్, అక్టోబర్ 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ దళితుల పట్ల అంటరానితనం పోలేదని గుజరాత్ నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, నేషనల్ దళిత్ రైట్స్ కార్యకర్త మార్టిన్ మాక్వాన్ అన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్యర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘అంటరానితనం నిర్మూలన, దళితులపై దాడులు నివారణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు మార్టిన్ మాక్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో నేటికీ అంటరానితనం కొనసాగుతున్నదని చెప్పేందుకు ఇటీవల రాజస్థాన్‌లో ఇంద్రకుమార్ మేఘవాల్ అనే దళిత బాలుడిని పాఠశాలలోనే కొట్టిచంపటమే ఉదాహరణ అని పేర్కొన్నారు. పాఠశాలలోని కుండలో నీరు తాగినందుకు ఆ బాలుడిని కొట్టి చంపారని గుర్తుచేశారు. ఓ బాలిక తన దళిత స్నేహితురాలి బట్టలు వేసుకొన్నందుకు చేతిలో నిప్పు కణిక పెట్టి కాల్చారని తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుజరాత్లో 2010 దశకంలో 1,589 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తే, అనేక గ్రామాల్లో దళితులు హిందువులైనా ఆలయ ప్రవేశం చేసే అవకాశం లేదని తెలిసిందని చెప్పారు.
64 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లకు కుర్చీపై కూర్చొనే హక్కు లేదని, చాయ్ కప్పు, నీటి గ్లాసులు వేరుగా పెడుతారని తెలిపారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలు మధ్యాహ్నం భోజనం అందరితో కలిసి చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కలెక్టర్ వెళ్లి పరిశీస్తే పాఠశాలలో ముగ్గురు వంట మనుషుల్లో దళిత, ఓబీసీ, జనరల్ వ్యక్తులు వేర్వేరుగా పనిచేస్తున్నట్టు తేలిందని చెప్పారు.
హత్యలు, లైంగికదాడులు నిత్యకృత్యం
సమాజంలో మహిళలు కూడా తీవ్ర అణచివేతకు గురవుతున్నారని మాక్వాన్ అన్నారు. నేపాల్‌లో దళిత విద్యార్థులకు కనీసం పాఠశాలలో ప్రార్థన చేసే అవకాశం లేదని తెలిపారు. బహిష్టు అయిన మహిళలను వారంపాటు ప్రత్యేక గదిలో బంధిస్తారని చెప్పారు. దేశంలో దళితులపై దాడులకు సంబంధించి 1977 వరకు ఎలాంటి డాటా లేదని, ప్రభుత్వాలు ఆ దిశలో చొరవ చూపలేదని విమర్శించారు. ‘గత 40 ఏండ్లలో 26 వేల మంది దళితులు, 5 వేల గిరిజనులు కుల అహంకార హత్యలకు గురయ్యారు.
54,500 మంది దళిత, 22,004 గిరిజన మహిళలపై లైంగికదాడులు జరిగాయి. 12.50 లక్షల ఎస్సీలు, 2.25 లక్షల ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయ’ని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా కూడా అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం తాము వినూత్న కార్యాచరణ చేపట్టామని, 90 మీటర్ల బ్యానర్ తయారుచేసి అంటరానితనం నిర్మూలనకు కచ్చితమైన హామీ ఇచ్చేవారినే ఎన్నుకుంటామని అందులో పేర్కొన్నామని తెలిపారు.
అంటరానితనం నిర్మూలనకు బడ్జెట్లో ఎంత కేటాస్తాయి? దాడులు, దౌర్జన్యాల నివారణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో మ్యానిఫెస్టోలో స్పష్టంచేయాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. సదస్సులో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వీ కృష్ణ, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, డాక్టర్ కనకరాజు, కే వినయ్‌కుమార్ పాల్గొన్నారు.