హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దళితబంధును కేవలం రాజకీయాల కోసమే తెచ్చిండ్రని, హుజూరాబాద్ కోసమే తెచ్చిండ్రని విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి కేసీఆర్.. తన తాజా నిర్ణయంతో బద్దలు చేశారు. ఇప్పటికే తాను సంకల్పించి.. లోతుగా ఆలోచించి చేపట్టిన అనేక పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి చూపించారు. ఇప్పుడు దళితబంధును కూడా అదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయబోతున్నారు. ఈ పథకాన్ని మొదట ఒక గ్రామంలో (యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి) అమలుచేశారు. అక్కడ దళితులందరితో సమావేశమై.. వారితో చర్చించి.. వారికి అవగాహన కల్పించి.. పథకానికి శ్రీకారం చుట్టారు. వాసాలమర్రి హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఆ తర్వాత దళితచైతన్యం కలిగి.. వామపక్ష ప్రాబల్యం అధికంగా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలును చేపట్టారు. నియోజకవర్గంలో పూర్తి సర్వేచేసి.. లబ్ధిదారులతో మాట్లాడి.. రూ.2000 కోట్లతో పథకం అమలును చేపట్టారు. లబ్ధిదారులకు వారు కోరుకొన్న యూనిట్ల పంపిణీ కూడా ప్రారంభమైంది. వాసాలమర్రికి.. హుజూరాబాద్ నియోజకవర్గానికి మధ్యన సారూప్యతలు లేవు. రెండింటి మధ్య దూరం ఎక్కువే. ఈ రెండిటి స్వరూప స్వభావాలు వేరు. రెండు భిన్నమైన ప్రాంతాలు, జీవనవిధానాలు, అవసరాలు ఉన్న చోట్ల పథకాన్ని అమలుచేసి చూశారు. ఇప్పుడు రాష్ట్రంలో నాలుగువైపులా నాలుగు జిల్లాల్లోని నాలుగు భిన్నమైన నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను ఎంపిక చేసుకొన్నారు. ఈ మండలాల్లో కూడా దళితుల జనజీవనం, వారి అవసరాలు, అవకాశాలు రకరకాలుగా ఉన్నాయి. వీటిలో కూడా పథకం అమలులో వచ్చే ఫలితాలు, పర్యవసానాలు, అనుభవాల ఆధారంగా పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరిస్తారు. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఇవేవీ అర్థంకాని విపక్షాలు.. దళితబంధును ఎన్నికల కోసమే తెచ్చారని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తెచ్చారని అడ్డగోలుగా విమర్శించాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా.. దానికి సుదీర్ఘ కసరత్తు ఉంటుంది. పలు పథకాలు కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూపుదాల్చాయి. సిద్దిపేటలో అమలుచేసిన వాటర్‌గ్రిడ్ పథకం.. తెలంగాణ వచ్చిన తరువాత మిషన్ భగీరథగా రూపాంతరం చెందింది. సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి.. ఇప్పుడు రాష్ట్రమంతా దళితబంధుగా ప్రతి దళిత కుటుంబంలో జ్యోతులు వెలిగించబోతున్నది. ఏ పథకమైనా మొదట చిన్నగా మొదలుపెట్టి, దాని ఫలితాలను బేరీజు వేసుకొని విస్తరించుకొంటూ పోతారు. దళితబంధు కూడా సరిగ్గా ఇదే పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా రాష్ట్రమంతా విస్తరించుకొంటూ వెళ్తున్నారు.
ఎన్నికలు లేని చోట్ల కూడా
దళితబంధు అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయించిన నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇప్పుడు ఎన్నికలు లేవు. ఈ నాలుగింటిలో ఒకటి మధిర నియోజకవర్గం. అది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం. అయినా అక్కడ దళితబంధు అమలుకు కార్యాచరణ చేపట్టారు. ఎందుకంటే దళితబంధు అమలులో రాజకీయాలు, రాగద్వేషాలు, పొలిటికల్ మైలేజీ.. వంటివి ఏవీ ఉండాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ పథకాన్ని అమలుచేయాలి అన్న ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణికి అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని ఎంపికచేశారు. దళితబంధు అమలుకు ముందే.. అన్ని పార్టీల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి విస్తారంగా చర్చించారు కూడా. ఇందులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం ఇవ్వరాదన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి కృషిచేయడం ద్వారా ఆ సమాజాన్ని వృద్ధిలోకి తీసుకొనిరావడం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర సంపద వృద్ధిలో భాగస్వామ్యం చేయడం దీని అంతిమ ప్రయోజనం.
కేసీఆర్ అభినవ అంబేద్కర్
సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బాంధవుడు. దళితబంధు పథకానికి తిరుమలగిరి మండలం ఎంపిక కావడం హర్షణీయం. ఈ పథకంతో దళితులు జీవనోపాధి పొందడమేకాకుండా ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాలు పెట్టుకొంటారు. రూ.10 లక్షలతో ఆటోలు, ట్రాలీలు, మినీ డెయిరీఫాంలు, చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి పొందే అవకాముంటుంది. సీఎం కేసీఆర్ ఏ పథకం తెచ్చినా నిబద్ధతతో కొనసాగిస్తారు. దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన మహానుభావుడాయన.
-గాదరి కిశోర్, తుంగతుర్తి ఎమ్మెల్యే
కేసీఆర్ అన్నారంటే చేసి చూపిస్తారు : నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
దళితబంధు పథకానికి చారగొండ మండలాన్ని ఎంపికచేయడం సంతోషంగా ఉన్నది. రాదన్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, వీలుకాదన్న దళితబంధు పథకాన్ని అమలుచేసి చూపిస్తారు. తెలంగాణ సాధిస్తామని చెప్పినప్పుడు అనుమానించినవారే దళితబంధుపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా విజయవంతం అవుతుంది. వాటి మాదిరిగానే దళితబంధు విజయవంతం అవుతుంది.
సీఎం కేసీఆర్‌కు నామా కృతజ్ఞతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దళితబంధు అమలు కోసం ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడంపై టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత, ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఖమం జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేద దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని, దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ డిమాండ్ చేసిన విషయాన్ని నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దళితబంధుతో కొత్త చరిత్ర
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళిత కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు చేపట్టిన మొదటి పథకం దళితబంధు. ఈ పథకంతో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. దళితబంధుకోసం ఎంపికచేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ఉండటం అదృష్టంగా భావిస్తున్నాము. కేసీఆర్ చల్లని చూపుతో జుక్కల్ ప్రజలందరికీ మేలు చేకూరుతుంది.
సీఎం హయాంలో దళితులకు స్వర్ణ యుగం
సీఎం కేసీఆర్ హయాంలో దళితులకు స్వర్ణయుగం రాబోతోన్నది. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్‌దే. నా నియోజకవర్గంలోని మండలాన్ని ఎంపికచేయటం చాలా సంతోషం. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకమనే ప్రతిపక్షాల తప్పుడు మాటలను దళితులు, ప్రజలంతా గుర్తించాలి. మారుమూల మండలమైన చారకొండను సీఎం సహకారంతో రాబోయే రెండేండ్లలో అభివృద్ధిలో ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతా.
దళితబంధు బృహత్తర పథకం
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట రూరల్, సెప్టెంబర్1: దళితబంధు బృహత్తర పథకమని, దీని అమలుతో ఇన్నాళ్లు దగాపడ్డ దళితబిడ్డల బతుకుల్లో వెలుగులు నిండుతాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డులో నిర్వహించిన దళిత బంధు సర్వేకు అధికారులతో కలిసి మంత్రి హాజరయ్యారు. కాలనీవాసులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. అనంతరం ఇండస్ట్రీయల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.
మా కష్టాలు తీర్చే దేవుడు
మాది పెద్ద కుటుంబమేగాని పేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు లేదు. బతికేందుకు గుంట భూమి లేదు. కాయకష్టం చేసుకొని కాలం వెళ్లదీస్తున్నం. ఉన్న ఒక్క గుడిసెను రెండు భాగాలు చేసుకొని.. ఓ భాగంల మేము, మరో భాగంల మా అన్న కుటుంబం ఉంటున్నం. కూలి పనిచేసుకొని బతుకుతున్నం. పని ఉన్ననాడు ఉంటది.. లేనినాడు లేదు. ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యంతోనే ఎల్లదీస్తున్నం. సీఎం కేసీఆర్ సారు దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తడని తెలిసింది. అదే నిజమైతే మా కష్టాలు దూరమైనట్టే. బర్రెలు, మేకలు తెచ్చుకొని సంతోషంగా ఉంటం. దేవుడే ఆయనను మాకోసం పంపించిండు.
-గులని సాయిలు, అంజవ్వ, నిజాంసాగర్, కామారెడ్డి
మా బతుకులు మారుతాయి
నాకు గుంట భూమి కూడా లేదు. రోజు కూలీగా బతుకుతున్న. కనీసం ఇల్లు కూడా లేదు. చిన్న పూరి గుడిసెలో ఉంటున్నం. మా ఇంటాయని కొన్నేండ్ల కింద చనిపోయిండు. నా రెక్కల కష్టంమీదనే కొడుకు, కూతురును చదివించుకొంటున్న. దళితబంధు పథకం వస్తే మా బతుకులు మారుతాయి.
-కాగేగామ నర్సవ్వ, నిజాంసాగర్, కామారెడ్డి
ఇగ కండ్లముందే కుటుంబం ఉంటది
నాకు ఒక్కగానొక్క కొడుకు. ఊర్ల పనిలేక బతుకుదెరువు కోసం పాలెం పోయిండు. కేసీఆర్ సారు ఇస్తున్న పింఛనుతోనే బతుకుతున్న. కనీసం ఉండేందుకు ఇల్లు కూడాలేదు. నాలుగు రేకులు వేసుకొని తలదాచుకుంటున్న. కేసీఆర్ సారు కొత్త పథకం తెస్తున్నడని చెప్పిండ్రు. మా అసుంటోళ్లకు రూ.10 లక్షలిస్తరట. ఆ సారు దేవుడే. ఆ పైసల్తోని బతుకతందుకు పోయిన కొడుకు, కోడలు, మనుమండ్లు ఈడనే ఉంటం. కుటుంబం కండ్లముందే ఉంటది. కొడుకు ఏదన్న దందా మోపుజేసుకుంటడు. ఇంతకన్న మాకు ఇంకేంగావాలె?
దళితుల తలరాత మార్చే పథకం
దళితబంధు దళితుల తలరాత మార్చే పథకం. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో ఈ పథకమే నిదర్శనం. పేదోళ్లు బాగుపడుతుంటే గిట్టని వాళ్లు ఓర్వలేక రాజకీయం చేస్తున్నారు. తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేయడంతో ఇక్కడి దళితుల తలరాత మారనున్నది. కరువు ప్రాంతమైన తిరుమలగిరిలో ఎన్నో దళిత కుటుంబాలు రెక్కల కష్టం మీద బతుకులు వెళ్లదీస్తున్నాయి. రూ.10 లక్షలు వస్తే వారి జీవితాలు మారిపోతాయి.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
నిజాంసాగర్ మండలానికి దళితబంధు ఇవ్వటం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ పథకంతో దళితుల గుండెల్లో దేవుడిగా కేసీఆర్ నిలుస్తారు.
-దఫేదార్ శోభ రాజు, జడ్పీ చైర్పర్సన్, కామారెడ్డి
సీఎం నిజమైన దళిత పక్షపాతి
సీఎం కేసీఆర్ నిజమైన దళిత పక్షపాతిగా నిరూపించుకొన్నారు. ఈ పథకంతో దళితులు రాబోయేకాలంలో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతి సాధిస్తారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చారకొండను ఈ పథకంలో చేర్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.