హుజూరాబాద్, మే 9 : ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నది. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని, అర్హులందరికీ రూ.5 లక్షలు ఇస్తామని ఇన్నాళ్లూ ఊరించి, ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. దళితబంధు వస్తే ఇందిరమ్మ ఇండ్లకు ఎగనామం పెడుతున్నది. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిని పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు ఎంపిక చేశారు. గ్రామసభపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ప్రకటించారు. రేషన్‌కార్డు, రైతుభరోసా, రైతుబీమా, ఇందిరమ్మ ఇండ్లు తదితర ప్రభుత్వపథకాలకు అర్హులైన వారి జాబితాను గతంలో గ్రామసభ నిర్వహించి అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేసిన జాబితాలో దళితబంధు లబ్ధిదారులు కూడా ఉన్నారు. అయితే జాబితాలో తమ పేరు వచ్చిందని దళితులు ఆనందంలో మునిగిపోగా.. దళితబంధు తీసుకున్నోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదే లేదని కొర్రీలు పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు.
గ్రామసభలో ప్రకటించిన జాబితాలో పేర్లు రావడంతో చాలామంది దళితులు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమయ్యారు. పాత ఇండ్లు కూల్చి కొత్తవి నిర్మించుకునేందుకు సిద్ధమైన వాళ్లు కొందరు, నానాతంటాలు పడి ఇంటినిర్మాణానికి అవసరయ్యే ఇసుక, బండ తెప్పించుకున్న వాళ్లు మరికొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరికి ఒక్కో దీనగాథ. మొదటగా ప్రకటించిన జాబితాలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రకటించగా.. తర్వాత, ఏమైందో తెలియదు కానీ, దళితబంధు వచ్చిన వాళ్లకు ఇల్లు ఇవ్వడం లేదని అధికారులు పేర్కొనడంతో దళితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ చిత్రంలో బేస్మెంట్ వరకు పూర్తయిన ఇంటి ముందు ఉన్న ఇతని పేరు ఎలికటి రవి. ధర్మరాజుపల్లిలో గతంలో నిర్వహించిన గ్రామసభలో ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు ఉండటంతో శిథిలమైన తన పాత ఇంటిని కూల్చివేశాడు. కొత్త ఇంటి నిర్మాణానికి అధికారులు ముగ్గు కూడా పోశారు. వారు ఇచ్చిన ప్లాను ప్రకారంగా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. బేస్మెంట్ వరకు పూర్తి చేశాడు. ఈ క్రమంలో గ్రామ కార్యదర్శి వచ్చి ఇల్లు నిర్మాణం ఆపాలని చెప్పడంతో రవి బిక్కమోహం వేశాడు. ఎందుకు మేడం? అని అడిగాడు. మీకు దళితబంధు స్కీం వచ్చినందున ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పడంతో అతను భోరున విలపించాడు. ఇలాంటి వారు గ్రామంలో 45 మంది ఉండడం గమనార్హం.
గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల జాబితా ప్రకటించారు. అందులో నా పేరు రావడంతో సంతోషమేసింది. పాత రేకుల కింద చుట్టూ పరదాలతో తలదాచుకుంటున్న. మేము కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నామని కలలు కన్నాం. ఇంటి నిర్మాణం కోసం ఇసుక, బండ తెచ్చుకున్నాం. పునాదులు తీద్దామని అనుకుంటుండగానే మీకు దళితబంధులో ట్రాక్టరు వచ్చిందని ఇల్లు కట్టుకోవద్దని అధికారులు చెప్పడంతో ఏమి చేయాలో తోచడంలేదు. అధికారులు దయతలచి కొత్తింటి కల నెరవేర్చాలి.