మధిర, ఫిబ్రవరి 14 : ఎస్సీ నియోజకవర్గమైన మధిరలో దళిత జవాన్‌పై అగ్రకులాల వారు దాడికి పాల్పడటం బాధాకరమని బీఎస్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని పోలీస్‌స్టేషన్ ఎదుట బీఎస్పీ నాయకులు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నాడు రేపల్లెవాడకు చెందిన మరియమ్మను ఇదే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి హతమార్చిన ఘటన మరిచిపోకముందే మళ్లీ ఇదే పోలీస్‌స్టేషన్‌లో దళిత జవాన్ మనోజ్‌పై అగ్రవర్ణ కులాలు అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యతవహించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దళిత జవాన్‌పై దాడిలో నిందితుల అరెస్టు
ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామానికి చెందిన దళిత జవాన్ బూదాల మనోజ్‌పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వైరా ఏసీపీ రెహమాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతకాని మండలం నాగులవంచలోని పెట్రోల్‌బంక్‌లో ఇటీవల జరిగిన గొడవకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈనెల 11న చింతకాని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మనోజ్‌పై గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన ఉమ్మినేని రమేశ్, చింతకానికి చెందిన లగడపాటి సాయి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మనోజ్ ఫిర్యాదు మేరకు రమేశ్, సాయిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం చింతకాని పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.
దళిత జవాన్‌పై దాడి దుర్మార్గం: ఎర్రోళ్ల
కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో దళిత జవాన్‌పై దాడి చేయడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం బాధాకరమని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మినేని రమేశ్, లగడపాటి సాయి గూండాయిజం చేస్తూ దాడులకు తెగబడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.