బషీరాబాద్, ఆగస్టు 16: దళిత మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై రమేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట దళిత సంఘాలు నిరసనకు దిగాయి. వికారాబాద్ జిల్లా నవల్గా గ్రామానికి చెందిన లోవాడ నరేశ్ కాశీపూర్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. మూడు నెలల కిందట ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు.
దీంతో ఎస్సై రమేశ్‌కుమార్ నరేశ్ తల్లిని మూడు నెలలుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలిసిన దళిత సంఘాలు శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగాయి. ఎస్సై రమేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అనంతరం తాండూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశాయి.