హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): దళితబంధు ప్రపంచానికే మార్గదర్శకమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ పథకం ఎస్సీల జీవితంలో వెలుగులు నింపుతున్నదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సంక్షేమభవన్‌లో ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధిపై 45 శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరికంలో మగ్గుతున్న ఎస్సీల బతుకుల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు సర్కారు అంకితభావంతో ముందుకెళ్తున్నదని అన్నారు. దళితబంధు నిధులను సక్రమంగా వినియోగించాలని, లబ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలివ్వాలని అధికారులకు సూచించారు. మార్చి నెలాఖరునాటికి నిధులను పూర్తిగా వినియోగించాలని ఆదేశించారు. సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు రాహుల్‌బొజ్జా, అధర్ సిన్హా, విజయ్‌కుమార్, యోగితారాణా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ పాల్గొన్నారు.