హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)/ ముషీరాబాద్: మతం పేరుతో సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతూ నిత్యం దళితులపై దాడిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్లోని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. బీజేపీ దళితులను ఓటు బ్యాంకుగా చూడటం తప్ప వారి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి.. తొమ్మిదేండ్లు అయినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందకుండా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నదని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల పట్ల చిత్తశుద్ధితో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి దోహదపడుతున్నారని అన్నారు. ప్రతి దళిత విద్యార్థుల విదేశీ విద్య కల సాకారానికి ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల సాయంతోపాటు మూడెకరాల భూమి, మద్యం, ఫెర్టిలైజర్ షాప్ల కేటాయింపులోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎమ్మార్పీస్ ప్రతినిధులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, తిరుమలేష్, శ్రీకాంత్, ఓయు అధ్యక్షుడు ఎల్ నాగరాజు, హైదరాబాద్ అధ్యక్షుడు సురేశ్, కార్తీక్ పాల్గొన్నారు.