మహబూబాబాద్ : దళిత బంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జెడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మానస పుత్రిక దళిత బంధు పథకం అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో అందరితో సమానంగా వారు వృద్ధిలోకి రావాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చారని పేర్కొన్నారు.
ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌లో చేపట్టి విజయవంతం చేశామన్నారు. అనంతరం ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 100 మందికి లబ్ధి చేకూర్చాలని, మార్చి 5వ తేదీ లోపు వీరిని గ్రౌండింగ్ చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
ప్రస్తుతం తక్కువ మంది దళిత కుటుంబాలు ఉన్న గ్రామాలు గుర్తించి అక్కడి దళిత కుటుంబాలు అన్నిటినీ పూర్తి స్థాయిలో ఎంపిక చేయాలన్నారు. అలాగే వ్యవసాయం చేసే దళితులకు ఏమైనా సాయం చేయగలమా? అసైన్డ్ భూములు ఉంటే వాటి అభివృద్ధికి సాయం చేయడంపై ఆలోచించాలన్నారు.
కోళ్ల ఫారాలు, పాలు, బర్రెలు, వంటి వాటి గురించి ఆలోచించాలన్నారు. ఏయే గ్రామాలలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, ఆ గ్రామాల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ పథకంపై ప్రజల అనుమానాలు ఏమున్నా నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.