వీణవంక, సెప్టెంబర్ 15: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం మొదటి విడత నిధులు ఇచ్చి చాలా రోజులైందని, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు రెండో విడత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. దళితులు ఎన్నోసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ధర్నాలు, నిరసనలు చేపట్టినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి ;టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, నూతన పీఆర్సీని అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరింది. ఆదివారం హైదరాబాద్ దోమల్‌గూడలోని కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రవి పాల్గొని.. మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దుకింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్ టీచర్లు, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ ఇవ్వాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తీర్మానాలు చేశారు.