హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: దళితబంధు రెండో విడుత లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట దళితబంధు రెండో విడుత లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు.
అధికారులకు వినతిపత్రం అందజేసిన అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను, పథకాన్ని రద్దుచేస్తే రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మార్చుతామని హెచ్చరించారు. జాబితా నుంచి ఏ ఒక్క లబ్ధిదారుడి పేరు తొలగించినా ఊరుకోబోమని చెప్పారు.
ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు. వారంరోజుల్లో దళితబంధు నిధులు జమ అవుతాయని ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చి 15 రోజులవుతున్నా ఎలాంటి స్పందనా రాలేదని మండిపడ్డారు. దళితబంధు డబ్బు జమ చేయకుంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ప్రజాభవన్‌కు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. దళితబంధు మంజూ రు చేయాలని వినతిపత్రాలను ఇచ్చేందుకు వెళ్తే పట్టించుకునే నాథుడేలేడని తెలిపారు.