హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వివిధ జిల్లాల నుంచి పాడి రైతులు హైదరాబాద్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించారు. అనంతరం డెయిరీ ఎండీ, చైర్మన్కు వినతిపత్రాలు సమర్పించారు. బిల్లుల చెల్లింపుతో పాటు సమస్యలు పరిష్కరించాలని కోరారు.
పీఐపీ పేరిట లీటర్ బర్రె పాలకు రూ.40 పైసలు, ఆవు పాలకు రూ.20 పైసల చొప్పున వసూలు చేస్తున్న మొత్తాన్ని 2023 డిసెంబర్ నుంచి జిల్లాలకు ఇవ్వడంలేదన్నారు. ఈ నగదను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణాలు తీసుకున్న రైతులకు రూ.10 వేల చొప్పున బోనస్ చెల్లించాలని, హామీ మేరకు పాడి రైతు కూతురు వివాహానికి రూ.5 వేలు, ప్రమాదంలో మరణించిన సభ్యుడి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని విన్నవించారు.