Sanitation | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యను మెరుగుపర్చడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) ప్రత్యేక దృష్టిపెట్టింది. డైలీ శానిటేషన్ రిపోర్టు (డీఎస్ఆర్) యాప్లో ఫొటోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించింది. ఈనేపథ్యంలో రోడ్లు, అంగన్వాడీ, సూళ్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, వాటర్ లీకేజీ, నల్లా కనెక్షన్లు, నీటి సరఫరా, వీధిలైట్లు ఇలా ప్రతిదీ యాప్లో అప్లోడ్ చేయాలని కార్యదర్శులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
దీంతో గ్రామ కార్యదర్శులు 9గంటలకే గ్రామాలకు చేరుకుంటున్నారు. పారిశుద్ధ్య, మురుగు కాల్వల పూడికతీత పనుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. కార్యదర్శుల పనితీరును పీఆర్ఆర్డీ కమిషనరేట్లో అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇదేమీ కొత్తగా వచ్చిందని కాదని, నిరుడు బీఆర్ఎస్ హయాంలోనే నుంచి ఉన్నదేనని పంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారు.
తాము నిరుడు కూడా ఫొటోలు, వివరాలను అప్లోడ్ చేశామని పేర్కొంటున్నారు. కార్యదర్శుల్లో మహిళలు కూడా ఉంటాయని, పిల్లలను స్కూళ్లకు పంపించడం ఇతర వ్యాపకాలు పూర్తిచేసుకోవడం ఎలా కుదురుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామ కార్యదర్శులు ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగులా? అని ప్రశ్నిస్తున్నారు.