హైదరాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): మలేషియా పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం దక్షిణ అండమాన్లో వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో హెచ్చరించింది. వచ్చే 48గంటల్లో వాయుగుండం పశ్చిమ, వాయవ్య దిశలో నెమ్మదిగా కదిలే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఆ తర్వాత మరింత బలపడి..దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ‘సెన్యార్’ అని పేరు పెట్టినట్టు వెల్లడించింది.
ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినట్టు వివరించింది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 30డిగ్రీలకు పైగా నమోదవుతున్నట్టు వెల్లడించింది. కాగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.1 నుంచి 17.9 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నది. తుఫాను ప్రభావం తో ఈనెల 26 నుంచి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.