TG Rains | తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దాని ప్రభావంతో రాగల 24గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 22 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని వివరించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహూబాబాద్, వరంగల్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడేందుకు అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 25 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.