ములుగు : ములుగు(Mulugu) జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఎడతెరిపిలేపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలక కారణంగా తాడ్వాయి మండలం మేడారం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున వీచిన భారీ గాలులతో 33 కేవీ ఫీడర్‌కు వెళ్లే 11 కేవీ విద్యుత్తు లైన్లో 16 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
అదేవిధంగా రెండు కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ శాఖ అధికారులు విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల కారణంగా రేపు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.