Christmas Gifts | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ వేడుకలపై సైబర్ నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు పథకం రచించారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తున్నది. ‘మీరు మా ప్రియమైన కస్టమర్. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ గిఫ్ట్ మీకోసమే. కింద ఇస్తున్న లింక్‌పై క్లిక్ చేసి, గిఫ్ట్ పొందండి’ అంటూ వచ్చే లింకులతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నది.
దీంతోపాటు ‘మీ ప్రియమైన వారికి ఈ లింక్ ద్వారా మీ ఫొటో, పేరుతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపండి’ అంటూ సోషల్ మీడియాల్లో, వాట్సాప్‌లలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. క్రిస్మస్ సీజన్లో ఈ కొత్త తరహా సైబర్ మోసాలు చేసేందుకు కుట్రలు పన్నారని పేర్కొన్నారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ పేరిట వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లింకులు పంపి.. వాటి ద్వారా ప్రమాదకరమైన మాల్వేర్ను ఓపెన్ చేసిన వారి ఫోన్లలోకి చొప్పించి, డేటా చౌర్యంతోపాటు, నగదును కూడా కొల్లగొట్టే కుయుక్తులు పన్నారని చెప్పా రు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే తక్షణమే 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.