హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కొత్త సినిమాల పేరుతో టెలిగ్రాం, ఫేస్బుక్, ఐబొమ్మ, బప్పం టీవీ, తమిళ్రాక్స్ వంటి వేదికల్లో కొందరు సైబర్ నేరస్థులు పాగా వేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. తెలియక ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే.. థర్డ్‌పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్‌తో డాటాను చోరీ చేస్తారని తెలిపింది. పైరసీ సినిమాల కోసం వెళ్లి ఖాతాలను గుల్ల చేసుకోవద్దని సూచించింది.
ఈ తరహా నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది. టెలిగ్రాం గ్రూపుల్లో వచ్చే లింక్స్‌తో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కొత్త సినిమాలు చూడాలనే ఆతృతతో వారి టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు గుడ్డిగా అనుమతిస్తూ వెళ్తే.. సర్వం దోచేస్తారని, ఫోన్ హ్యాంగ్ అయి.. వారి కాంటాక్ట్‌లో ఉన్న అందరికీ అవే లింక్స్ వెళ్తాయని సీఎస్బీ హెచ్చరించింది. వీలైనంత వరకూ సోషల్ మీడియా ఖాతాలకు ప్రొఫైల్ లాక్ వేసుకోవాలని సూచించింది.