Matrimony | ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 3: మ్యాట్రిమోని డాట్‌కామ్‌తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రామగుండం సైబర్‌క్రైమ్ పోలీస్టేషన్ ఎస్‌హెచ్‌వో ఎం వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 5న మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని రూ.17 లక్షలు మోసపోయి సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా ఏపీలోని ఏలూరు జిల్లా అశోక్‌నగర్‌కు చెందిన ఎర్ర వెంకటనాగరాజు, రామంచ సౌజన్య దంపతుల సైబర్‌క్రైమ్ బయటపడిం ది.
వీరు మ్యాట్రిమోని డాట్‌కామ్ అనే వెబ్సైట్లో వారి మొబైల్ నంబర్లతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందమైన అమ్మాయిల ఫొటో లు అప్లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పెడుతున్నారు. స్పందించిన వారితో మోసపూరితంగా డబ్బులు వసూలు చేశారు. వీరిని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఘరానా మోసం బయటపడినట్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు.