హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల అక్రమాలను నివారించేందుకు ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అభ్యర్థుల దుష్ప్రవర్తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇందులో అప్లోడ్ చేస్తే, ఫిర్యాదు అందిన 1.40 నిమిషాల్లో స్పందించనున్న విభాగం చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎన్నికల సంఘం భరోసా కల్పిస్తున్నది.
ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత సమయంలోగా స్పందించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను (ఎఫ్ఎస్టీ) ఏర్పాటు చేసింది. చర్యలు తీసుకున్న విషయంపై ఫిర్యాదుదారుడికి సమాచారం అందుతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలు, ఆడియోలు అప్లోడ్ చేయొచ్చు. యాప్‌తో పాటు 1950 నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నది.