హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చేసిన కృషితో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు నీట్ పీజీ-2023 ఇంటర్న్‌షిప్ కటాఫ్‌ను ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగించింది. దీంతో కొత్తగా అర్హత పొందే అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ (ఎన్బీఈఎంఎస్) గతంలో నీట్ పీజీ-2023 షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 31న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. మార్చి 31లోగా ఎంబీబీఎస్ కోర్సుతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తయిన విద్యార్థులు అర్హులని స్పష్టం చేసింది.
ఈ నిబంధన కారణంగా రాష్ట్రంలోని 25 మెడికల్ కాలేజీల ఎంబీబీఎస్ విద్యార్థులు నీట్ పీజీకి దరఖాస్తు చేయలేని పరిస్థితి తలెత్తింది. ఎంబీబీఎస్ పట్టా రావాలంటే నాలుగేండ్ల కోర్సు, అనంతరం ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా 2020 నుంచి రెండేండ్లపాటు అన్ని పరీక్షలను వాయిదా వేశారు. దీంతో ఎంబీబీఎస్ పరీక్షల నిర్వహణ కొన్ని నెలలపాటు ఆలస్యమైంది. 2017 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు గత సంవత్సరం మేలో చివరి సంవత్సరం పరీక్షలు రాశారు. ఫలితాలను యూనివర్సిటీ ఆగస్టు 3వ వారంలో విడుదల చేసింది. ఆ వెంటనే ఇంటర్న్‌షిప్ ప్రారంభమైంది. ఇది ఏడాది పాటు కొనసాగుతుంది. రానున్న ఆగస్టులో వారి ఇంటర్న్‌షిప్ పూర్తవుతుంది. మార్చిలోగా ఇంటర్న్‌షిప్ పూర్తి కావాలన్న ఎన్బీఈఎంఎస్ నిబంధనతో వారు దరఖాస్తు చేయలేని పరిస్థితి నెలకొన్నది. వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే వచ్చే ఏడాది దాకా నిరీక్షించాల్సి వస్తుంది. ఇలా 25 కాలేజీలకు చెందిన వేలాది విద్యార్థులు నష్టపోతున్నట్టు గుర్తించిన కాళోజీ హెల్త్వర్సిటీ.. ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువును ఆగస్టు వరకు పొడిగించాలని కేంద్ర ఆరోగ్యశాఖకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు లేఖ రాసింది.
హెల్త్వర్సిటీ అభ్యర్థనను తొలుత కేంద్రం పెడచెవిన పెట్టింది. కటాఫ్ తేదీని మార్చి నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తూ ఎన్బీఈఎంఎస్ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. హెల్త్వర్సిటీ అధికారులు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు పరిష్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్న విషయాన్ని తాము కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నది.