జైపూర్, ఆగస్టు 23: కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు కోతలు తీవ్రం కావడంతో వారు అంధకారంలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజురోజుకు విద్యుత్తు సరఫరా గజారుతుండటంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. రోజుకు గంట, గంటన్నర విద్యుత్తు కోత విధిస్తున్నామని అధికారికంగా చెబుతున్నప్పటికీ ఐదారు గంటల పాటు కరెంట్ కట్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మీ వంద యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీకో దండం.. రోజువారీగా కరెంట్ సరఫరా చేస్తే చాలు అంటూ మొత్తుకుంటున్నారు. విద్యుత్తు సరఫరా లేక పంటలకు నీళ్లు పెట్టుకోలేకపోతున్నామని, దీంతో అవి ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు కోతలపై ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ దారులపై దృష్టి సారించింది. అదనంగా విద్యుత్తు లభించే పరిస్థితి లేకపోవడంతో పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్తులో కోతలు విధించి దానిని గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. పొలాలకు నీరు పొందడానికి పగటికి బదులు రాత్రి వేళల్లో విద్యుత్తు సరఫరా చేయాలని నిర్ణయించారు. ప్రజలు, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం గెహ్లాట్ చెప్పారు. విద్యుత్తు సమస్యపై అధికారులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి అప్రకటిత విద్యుత్తు కోతలు విధించవద్దని ఆదేశించారు. ఒకవేళ కరెంట్ కోత తప్పనిసరైతే దానిని తప్పక తెలియజేయాలని అన్నారు. ఒక్క రాజస్థాన్లోనే కాదు ఉత్తర భారత్లోని అన్ని రాష్ర్టాలలోనూ ఆగస్టులో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎక్కువ మొత్తానికి విద్యుత్తును కొనుగోలు చేద్దామన్నా లభించడం లేదని చెప్పారు.
సీఎం గెహ్లాట్ నిర్ణయం కారణంగా అసలే అంతంతమాత్రంగా సరఫరా చేస్తున్న విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తే తాము రోడ్డున పడతామంటూ పలు చిన్న, మధ్యతరగతి పరిశ్రమల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్తు కోతల వల్ల ఇప్పటికే పలు పరిశ్రమలు కునారిల్లుతున్నాయని, ఇక పూర్తిగా కరెంట్ కట్ చేస్తే పరిశ్రమలు మూసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, విద్యుత్తు కోతల కారణంగా పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు సైతం రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వర్షాలు సరిగా పడకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగిందని అధికారులు చెప్తున్నారు. దీంతో విద్యుత్తు లోడ్ తట్టుకోవడానికి ప్రభు త్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాలేకుండా ఎడాపెడా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నది. రాష్ట్రంలో రోజుకు సగటు విద్యుత్తు వినియోగం 3400 లక్షల యూనిట్లను దాటేసిందని అధికారులు తెలిపారు. అంటే గరిష్ఠంగా విద్యుత్తు డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాది తగినంతగా వానలు పడకపోవడం, దానికి తోడు విద్యుత్తు వినియోగం పెరగడంతో డిమాండ్-సప్లయిని సమతుల్యం చేయడానికి కోతలు విధిస్తున్నట్టు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాజస్థాన్ 23,309 మెగావాట్ల విద్యుత్తుతో మిగులు రాష్ట్రంగా ఉందంటూ ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని విపక్ష నేత రాజేంద్ర రాథోడ్ విమర్శించారు. 100 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేసిన గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిరోజు ఐదారు గంటల కోత విధిస్తున్నదని మండిపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ అక్రమ, అవినీతి విధానాల వల్ల ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.