మెదక్‌రూరల్, అక్టోబర్ 22 : మెదక్ జిల్లా హవేళీ ఘన్‌పూర్‌లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు మంగళవారం కరెంట్ షాక్‌తో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్పోర్ట్స్ ఫ్లాగ్ రూపొందిస్తుండగా ఇనుప రాడ్ కరెంటు తీగలకు తగిలింది. రాడ్ పట్టుకున్న ఇంటర్ విద్యార్థిని రజిత, పదో తరగతి విద్యార్థినులు వసంత, అనుష్క, గాయత్రి చేతులకు షాక్ కొట్టింది. ప్రిన్సిపాల్ విజయనిర్మల వారిని వెంటనే మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం మెదక్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించారు. విషయం తెలిసి మెదక్ ఆర్డీవో రమాదేవి దవాఖానకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు.
విద్యార్థులను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. గురుకులం పిన్సిపాల్తో మాట్లాడారు. ఏదైనా పని ఉంటే వర్కర్లను పెట్టి చేయించాలని, విద్యార్థులతో పని చేయించవద్దని సూచించారు.