Rythu Bhima | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతుబీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది. ప్రభుత్వం ఇప్పటివరకు అర్హులైన రైతుల కొత్త జాబితాను రూపొందించలేదు. సాధారణంగా రైతుబీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు 14న మొదలై, వచ్చే ఏడాది ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల 13తో ముగియనున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన పాత రైతులతోపాటు కొత్త రైతుల వివరాలను సేకరించి జాబితాను సిద్ధం చేయాలి. రైతుల సంఖ్య ఆధారంగా పాలసీ చెల్లించేందుకయ్యే మొత్తానికి ప్రభుత్వానికి సిఫారసులు పంపించి.. ఎల్ఐసీకి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ సర్కారు, వ్యవసాయ శాఖ మాత్రం రైతుబీమాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే గత సంవత్సరం పాలసీ నిధులు చెల్లించకుండా రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసిన సర్కారు.. ఇప్పుడు మొత్తం పథకానికి ఎసరుపెట్టే పరిస్థితి తీసుకొచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సెలవు రోజుల్లో సర్యులర్లు
రైతుబీమా పథకం ముగింపు గడువు ముంచుకొస్తుంటే, ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ సెలవు రోజుల్లో సర్కులర్లు జారీ చేస్తూ హడావుడి చేస్తున్నది. రైతుబీమాకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలంటూ శనివారం ఏఈవోలకు సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి ఈ నెల 13 వరకు అప్లోడ్ చేయాలని ఆదేశించింది. పాత రైతులకు సంబంధించిన వివరాలను ఈ నెల 12 వరకు పున:పరిశీలించాలని సూచించింది. ఆదివారం సెలవు దినాన్ని తీసేస్తే మిగిలింది రెండు రోజులే. గతంలో రైతుబీమాకు సంబంధించి కొత్త రైతుల నుంచి దరఖాస్తులతోపాటు పాత రైతుల వెరిఫికేషన్ జూలై 20న మొదలుపెట్టి… 10-15 రోజులపాటు డ్రైవ్ నిర్వహించేవారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకునేవారు. ఏఈవోలు కూడా ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులు అప్లోడ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. జూన్ 5వ తేదీ వరకు పాస్‌పుస్తకాలు వచ్చిన కొత్త రైతులకు మాత్రమే అవకాశం కల్పించింది. ఆ తర్వాత పాస్ పుస్తకాలు పొందిన వేల మంది కొత్త రైతులకు సర్కారు మొండిచేయి చూపిందనే విమర్శలొస్తున్నాయి. సర్కారు ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏఈవోలపై ఒత్తిడి
రైతుబీమా పథకానికి అర్హులైన రైతుల వివరాలను ఈ నెల 13 వరకు పూర్తి చేయాలంటూ ఏఈవోలపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘మీ చావు మీరు చావండి.. కానీ, రెండు రోజుల్లో పని పూర్తి కావాలి..’ అంటూ అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. వ్యవసాయ శాఖ ఆదేశాలపై ఏఈవోలు మండిపడుతున్నారు. శనివారం సర్యులర్ ఇచ్చి మంగళవారం వరకు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో రైతులకు సమాచారం ఏ మేరకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిరుడు 41 లక్షల మంది రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అంటే మూడు రోజుల్లో 41 లక్షలకుపైగా దరఖాస్తుల పరిశీలన ఏవిధంగా పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం రైతులంతా వరి నాట్లు, ఇతర పంటల సాగులో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో రైతులందరి నుంచి సమాచారం తీసుకోవడం సవాలేనని అంటున్నారు. దరఖాస్తుల్లో ఏ చిన్న తప్పు జరిగినా పరిహారం ఇచ్చేందుకు ఎల్ఐసీ ససేమిరా అంటున్నదని ఏఈవోలు చెప్తున్నారు. పాత, కొత్త దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని, ప్రస్తుతం తమకు ఇచ్చిన ఓల్డ్ వర్షన్ ట్యాబ్‌లతో ఈ పనిచేయడం సవాలుగా మారిందని ఏఈవోలు వాపోతున్నారు. తక్కువ సమయం ఇచ్చి, తమపై ఒత్తిడి పెంచుతున్నారని, ఒకవేళ భవిష్యత్‌లో ఏదైనా తప్పులు జరిగితే అందుకు తమను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏఈవోలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సర్కారు పైసలు ఇచ్చేనా?
రాష్ట్రం దివాలా తీసిందని పదేపదే చెప్తున్న ప్రభుత్వ పెద్దలు ఏ పథకానికీ పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో రైతుబీమా పథకానికి నిధులు విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకానికి సుమారు రూ.1,500 కోట్ల నిధులు అవసరం. నిరుడు 41 లక్షల మంది రైతులు ఎన్రోల్ చేసుకోగా ప్రభుత్వం ప్రీమియం కింద రూ.1,477 కోట్లు ఎల్ఐసీకి చెల్లించింది. ఈ ఏడాది రైతుల సంఖ్య, ప్రీమియం పెరిగే అవకాశం ఉండటంతో ఈ మొత్తం రూ.1,500 కోట్లు దాటొచ్చని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు కూడా ప్రభుత్వం రైతుబీమా ప్రీమియంను ఆలస్యంగా చెల్లించింది. దీంతో నాలుగైదు నెలలపాటు ఎల్ఐసీ రైతులకు బీమా పరిహారం చెల్లింపును నిలిపివేసింది. గత సంవత్సరానికి సంబంధించి ఇంకా కొంత మొత్తం బకాయి ఉన్నట్టు తెలిసింది. దీనికితోడు ఇప్పటివరకు రైతుల సంఖ్య ఫైనల్ కాకపోవడంతో అర్హుల జాబితాను రూపొందించేదెప్పుడు.. ప్రభుత్వానికి పంపించేదెప్పుడు.. అవసరమైన నిధుల విడుదల ఆమోదం పొందేదెప్పుడు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.