Assembly Session | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. విరామం అనంతరం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభంకాగానే బీఆర్ఎస్ మహిళా సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లేచి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
నిరసనల మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను స్పీకర్ చేపట్టారు. బిల్లుపై మాట్లాడాలని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి మైక్ ఇచ్చారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను ఆర్డర్లో పెట్టాలని కోరుతూ మహేశ్వర్‌రెడ్డి తన ప్రసంగాన్ని ఆపారు. స్పీకర్ మాత్రం మైక్‌ను ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా కాంగ్రెస్ సభ్యుడు వివేక్‌కు అవకాశమిచ్చారు. దీంతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి లేచి అతిముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించాలని, బీజేపీ, సీపీఐ కూడా మాట్లాడాల్సి ఉన్నదని డిమాండ్ చేశారు.
అయితే, స్పీకర్ వారెవరికీ అవకాశం ఇవ్వకుండా వివేక్‌కు మైక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యనే మాట్లాడిన వివేక్.. సభను ఆర్డర్లో పెట్టాలంటూ ప్రసంగం ఆపి సీట్లో కూర్చున్నారు. తదుపరి ఎవరికీ అవకాశం ఇవ్వకుండానే బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం లేచి నిలబడి నిరసన వ్యక్తంచేశారు. స్పీకర్ ఆవేవీ పట్టించుకోకుండా సభ ఆమోదానికి ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. దీంతో ఆయన బిల్లును ప్రవేశపెట్టగా, ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సభను గురువారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. విరామం అనంతరం అంతా 30 నిమిషాల్లోనే సభను ముగించడం గమనార్హం.
సీపీఐ వాయిదా తీర్మానం తిరస్కరణ
ఖమ్మం, నల్లగొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, పరకాల తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు పంపిణీ తదితర సమస్యలపై చర్చించాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందజేశారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.