హైదరాబాద్,మే 28,(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ‘ఏక్‌భారత్-శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో సాంస్కృతికంగా మరింత చేరువయ్యాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ – యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలపై పరస్పర అవగాహన కోసం కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంసృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్, సునీల్‌కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్‌రెడ్డి(నోడల్ ఆఫీసర్) తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) ముంబై 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ కమాండర్ కల్నల్ అభిషేక్ సింగ్ గురువారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.