హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వారం నుంచి కురుస్తున్న చిరుజల్లులు, ముసురు, భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో పంటల చేనుల్లో నీళ్లు నిలబడి పంట కుళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. విత్తిన విత్తనాలు మురిగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో పంటల వారీగా జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వరి నార్లు పోసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. కొన్ని చోట్ల ఇప్పటికే నార్లు పోశారు. అదే విధంగా కొన్ని చోట్ల పత్తి, మక్కజొన్న, కూరగాయ పంటల విత్తనాలు నాటారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అవి..
పత్తి: ప్రస్తుతం లేత దశలో ఉన్న పత్తి నీటి నిల్వను తట్టుకోలేదు. గండ్లు పెట్టి నీటిని తొలగించాలి. ఈ వానలకు కలుపు అధికంగా వచ్చి పంటతో పోటీ పడుతుంది. వర్షం తగ్గాక పైరితియోబాక్ సోడియం, క్యుజాఫాప్ పీ ఎతిల్ కలిసిన మందు ఎకరాకు 450 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. ఈ మందును కంది అంతర పంటగా ఉంటే వాడొద్దు. బూస్టర్ డోస్ ఎకరాకు 25-30 కిలోల యూరియా మొకల పకన వేయాలి. పోషకలోప నివారణకు ఫార్ములా 4, స్పెడమాక్స్ 1 పిచికారీ చెయ్యాలి. కాండానికి బొట్టు పెట్టే విధానంతో రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు.
మకజొన్న: మక్కజొన్న పైరులో కూడా నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. వర్షం తగ్గాక బూస్టర్ మోతాదుగా 35 కేజీల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. జింక్, బోరాన్ లోపాలు కనిపిస్తే బోరాన్ 2 గ్రాములు, చిలేటెడ్ జింక్ 1 గ్రాము చొప్పున 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
కూరగాయల పంటలు: ఈ వర్షాలకు కూరగాయల పంటలను కుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. దానికోసం 10 లీటర్ల చొప్పున 30 గ్రాముల కాపర్ ఆక్సిక్టోరైడ్ కలిపి పిచికారి చేయాలి. పోషక లోప నివారణకు 13-0-45 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున, ఫార్మూలా 4 లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారి చేయాలి.
వరి: నారు మళ్లు ఇప్పటి వరకు వేయకుంటే మరో 2-3 రోజులు ఆగాలి. లేకుంటే వేసిన విత్తనం కుళ్లిపోతుంది. మొలక శాతం తగ్గుతుంది. ఇప్పటికే వరి నారు మళ్లు వేసుకొన్న చోట్ల మడిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాల్లో, మడుల్లో నిలిచిన నీటిని తొలగించాలి. చిన్న మొలకలు అధిక నీటి నిల్వను తట్టుకోలేవు. కలుపు మందులు ప్రస్తుతం వాడకుండా ఉంటే మంచిది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చాక సిఫారసుల ప్రకారం ఎరువులు, కలుపు మందులు చల్లాలి. వర్షం తగ్గాక, వరి నారు మళ్లు పండుబారి పేలవంగా ఉన్న చోట్ల ఎకరాకు సరిపోయే నారుమడికి 1.5 నుండి 2 కిలోల యూరియా వేయాలి. లీటర్ నీటికి చిలేటెడ్ జింక్ 1 గ్రాము లేదా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి పిచికారి చెయ్యాలి. నారు మడి తీయటానికి పది రోజుల ముందుగా కార్బోఫురాన్ వేయాలి.