హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీ అకౌంట్స్ ఉద్యోగికి వాట్సప్‌లో మెస్సేజ్ వచ్చింది. అది కొత్త నంబర్ అయినా డీపీ చూస్తే సీఎండీ ఫొటో ఉంది. తన బాస్ అనుకుని ఆ ఉద్యోగి చాటింగ్ చేశాడు. కొత్త ప్రాజెక్ట్ కోసం కంపెనీ అకౌంట్ నుంచి తాను చెప్పిన నంబర్‌కు రూ.1.95 కోట్లు బదిలీ చేయాలని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మెస్సేజ్ చేసిన వ్యక్తి ఉద్యోగితో అన్నాడు. ఆ ఉద్యోగి డబ్బును సంబంధిత నంబర్‌కు పంపాడు. నెల తర్వాత బాస్ అకౌంట్స్ గురించి అడగడంతో విషయం.. ఫలానా నంబర్‌కు అమౌంట్ పంపాలని మీరే చెప్పారు కదా! అని ఉద్యోగి తెలిపాడు. ఫోన్ జరిగిన చాటింగ్ వివరాలు కూడా చూపించాడు. అది తాను కాదని బాస్ చెప్పడంతో… జరిగిన మోసం బయటపడింది. ఆ ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు ఆ డబ్బును పూర్తిగా ఫ్రీజ్ చేశారు.
Cyber Crime | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు వెతుకుతున్నారు. అందినకాడికి డబ్బులు దండుకునేందుకు ఐటీ సంస్థల యజమానులు, హెచ్ఆర్ మేనేజర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వెంటపడ్డారు. ఆయా కంపెనీల సీఎండీ, ఎండీ, సీఈవోల ఫొటోలతో డీపీలు సెట్ చేసుకుని, కంపెనీలోని అకౌంట్స్ ఆఫీసర్లు, హెచ్ఆర్ మేనేజర్లు, సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు మెసేజ్‌లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు తెలంగాణలో వెలుగు చూస్తుండటంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పలు హెచ్చరికలు జారీ చేసింది. కార్పొరేట్ కార్యాలయాలు, ఐటీ కంపెనీల యజమానులు, ఉద్యోగులు కొత్తతరహా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కొత్త తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో సీఎస్బీ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఏదైనా ఓ సంస్థ యజమాని ఫొటోను వాట్సప్, మెయిల్ డీపీగా సెట్ చేసుకుంటున్నారని తెలిపారు. మెయిల్ ఐడీని కూడా సదరు కంపెనీ పేరుతోనే క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత కంపెనీలోని అకౌంట్స్, హెచ్ఆర్ విభాగంలోని ఉన్నత ఉద్యోగులకు మెస్సేజ్ చేస్తున్నారని, ట్రాప్‌లో పడ్డారని గుర్తించినప్పుడు కొత్త ప్రాజెక్ట్, ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ కోసం అంటూ అత్యవసరంగా డబ్బులు పంపాలని చెప్తున్నారని వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులే లక్ష్యంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాస్‌లు, పై అధికారుల పేరుతో ఎవరైనా వాట్సప్, మెయిల్ ద్వారా చాటింగ్ చేస్తుంటే ఫోన్ చేసి ఎవరో నిర్ధారించుకోండి. డబ్బులు అడుగుతున్నారంటే వాళ్లు కచ్చితంగా సైబర్ నేరగాళ్లు కావొచ్చు. అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేసి, www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త తరహా నేరాలపై అప్రమత్తత, అవగాహన అవసరం. డబ్బులు కోల్పోతే గంటలోపే రిపోర్ట్ చేయాలి.
– శిఖాగోయెల్, డీజీ సీఎస్బీ