హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులతోపాటు ఇతర అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతిని ఆమె శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హరితహారం, దశాబ్ది సంపద వనాల కింద నిర్దారిత లక్ష్యాలను పూర్తిచేయాలని కోరారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో 1,266 మందికి సూపర్ న్యూమరరీ పోస్టుల్లో కారుణ్య నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, నోటరీ స్థలాల క్రమబద్ధీకరణను పూర్తిచేయాలని, జీవో 59 కింద లబ్ధిదారుల నుంచి రుసుము మొత్తాన్ని జమచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధక శాఖ ఎస్సీఎస్ అధర్ సిన్హా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.