హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth reddy) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం(LB Stadium)లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shantikumari ) బుధవారం పరిశీలించారు. డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా, రేవంత్రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఆయన రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సమయంలో మార్పులు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ప్రమాణస్వీకార వేదికలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎల్బీ స్టేడియంలోనే ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది.