CS Shanti Kumari | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాలపై కలెక్టర్లతో సీఎస్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం నిర్వహిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో, రాష్ట్ర రాజధానిలో ఘనంగా నిర్వహిచాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఆరు రకాల బ్యానర్లు పంపిణీ చేశామన్నారు. గ్రామాలు నాడు-నేడు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారడం, ఓడీఎఫ్ ప్లస్, ఆసరా పింఛన్లు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రగతి నివేదిక, రాష్ట్రస్థాయిలో ప్రగతి నివేదికలు తెలిపే బ్యానర్లు పంపిణీ చేశామని తెలిపారు. గ్రామ పంచాయతీ వరకు గ్రామస్తులచే ర్యాలీగా వెళ్తారని, అక్కడి సమావేశంలో సఫాయి కార్మికులకు సన్మానం చేస్తారని తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ఉత్తమ సర్పంచులను సన్మానించనున్నట్లు చేయనున్నట్లు వివరించారు.
ఈ నెల 16 న నిర్వహించే పట్టణ ప్రగతిలో రాష్ట్రంలోని అన్ని అర్బన్ మున్సిపాలిటీలలో ఉత్తమ మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించనున్నట్టు సీఎస్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలలో ర్యాలీలు నిర్వహించి, టీఎస్ బీపాపాపై వివరించనున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలు సాధించిన ప్రగతిని తెలియజేస్తారన్నారు. మున్సిపల్ వాహనాలను అందంగా అలంకరించాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదారాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయాలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభిస్తారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన అభివృద్ధిని తెలియజేసే అభివృద్ధిపై రూపొందించిన బుక్ లెట్లు, వీడియో చిత్రాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 17న గిరిజనోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా గిరిజన సర్పంచులు, ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,216 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశామని, ఈ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేయడం జరుగుతుందని చెప్పారు. 3,146 గిరిజన గ్రామాల్లో, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏల్లో ఈ గిరిజనోత్సవం కార్యక్రామాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రగతి నివేదికలు ప్రదర్శించడంతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటి వరకు జరిగిన దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై కలెక్టర్లను అభినందించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ల పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.