హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన రాళ్లవానకు జరిగిన పంటనష్టం వివరాలను తెలుసుకునేందుకు ఏఈవోలతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఎలాంటి విమర్శలు రాకుండా పారదర్శకంగా సర్వేచేసి ప్రభుత్వానికి త్వరగా నివేదిక అందించాలని సూచించారు. పంటనష్టంపై బుధవారం బీఆర్కే భవన్లో ఆమె కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థికసాయం ప్రకటించారు. పంటనష్టంపై సర్వే నిర్వహించి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. పంటనష్టం సర్వేపై ఆదేశాలు జారీ చేశారు. పంటనష్టం అంచనాకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించారు.