హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఈ నెల 28న తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వస్తున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi Kumari) శనివారం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవాన్ని, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని సీఎస్ వివరించారు.
రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా (Security) ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్(Traffic), బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను కోరారు. విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు,జీహెచ్ఎంసీ అధికారులతో చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖకు ఆదేశించారు. ఈ సమీక్షలో డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.