Telangana | హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): మైనింగ్‌కు సంబంధించిన చిన్నచిన్న డీవియేషన్లకు కూడా గనుల శాఖ అధికారులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని క్రషర్ల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూడు, నాలుగు హెక్టార్లలో ఉన్న చిన్నచిన్న మైనింగ్‌లో సైతం ఒకటి-రెండు మీటర్లు డీవియేషన్ జరిగినట్టు గుర్తించినవాటికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు చొప్పున జరిమానాలు విధిస్తుండటంతో క్రషర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. పది హెక్టార్లు, అంతకన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న గనులకు రూ.వంద కోట్లకుపైగా పెనాల్టీలు విధిస్తున్నారు. భారీ పెనాల్టీలు చెల్లించకలేక పలువురు గనులను మూసివేసుకోగా, జరిమానాలు చెల్లించలేదనే కారణంతో అధికారులు 261 క్రషర్లను సీజ్ చేశారు. మరికొన్ని క్రషర్లు మూసివేత బాటలో ఉన్నాయి.
గనుల శాఖ వేధింపుల వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు నేతల ప్రమేయం ఉన్నదని, ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాల క్రితం మంజూరైన మైనింగ్ లీజులే కొనసాగుతున్నాయి. ఇటీవల అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే చేపట్టిన గనుల శాఖ ఒక్కో మైనింగ్ వద్దకు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. దీంతో గతంలో నిర్ధారించిన సరిహద్దులకు, ఇప్పుడు ఈటీఎస్ సర్వే ద్వారా నిర్ధారిస్తున్న సరిహద్దులకు పొంతన కుదరడంలేదు. కొందరు గనుల యజమానులు అనుమతి కన్నా ఎక్కువ మైనింగ్ చేసిన ఘటనలు వెలుగుచూస్తుండగా, కొన్నిచోట్ల సర్వేలో లోపాల వల్ల డీవియేషన్ జరిగినట్టు తప్పుడు నిర్ధారణ అవుతున్నదని చెప్తున్నారు. మైనింగ్‌లో డీవియేషన్లు గుర్తిస్తే, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం, అవసరమైతే లీజులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం గనుల శాఖ ఇందుకు విరుద్ధంగా క్రషర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని క్రషర్లను చూసీచూడనట్టు వదిలేస్తూ, మరికొన్నింటిని మూసివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో డీవియేషన్లను నిర్ధారించి జరిమానాలు విధించే అధికారం గనుల శాఖకు ఉన్నదని, ఏకపక్షంగా డీవియేషన్లను నిర్ధారించి ఇష్టారాజ్యంగా పెనాల్టీలు విధిస్తున్నారని గనుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
వెయ్యి కోట్ల ఆదాయమే టార్గెట్‌గా..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక కంకర రాయల్టీని టన్నుకు రూ.250 నుంచి రూ.395కి పెం చడంతోపాటు పర్మిట్ ఫీజు పేరుతో అదనంగా మరో రూ.58 వసూలు చేస్తున్నారు. దీనివల్ల నేరుగా టన్ను పై రూ.200కుపైగా ప్రజలపై భారం పడుతున్నది. క్రషర్లపై తనిఖీల పేరుతో గనులు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి క్వా రీలు, క్రషర్లపై నిత్యం దాడులు నిర్వహిస్తున్నారు. రాయల్టీ సరిగా చెల్లించడంలేదని, అనుమతించిన దానికన్నా ఎక్కువ మైనింగ్ చేస్తున్నారంటూ భారీ పెనాల్టీలు విధిస్తున్నారు. దీంతో కంకర, మ్యానిఫ్యాక్చరింగ్ శాండ్ (రోబోశాండ్) ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 750 వరకూ స్టోన్ క్రషర్లు ఉం డగా, నిరుడు రాయల్టీ ద్వారా రాష్ర్టానికి రూ.650 కో ట్ల వరకు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ. 1,000 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, ఇందులో భాగంగానే గనులపై దాడులు నిర్వహిస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
గనులపై అధికార పార్టీ నాయకుల కన్ను!
గనుల శాఖ అధికారులు చెప్తున్నదానికీ, బయట జరుగుతున్న ప్రచారానికి పొంతన కుదరడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమతమ ప్రాంతాల్లో నడుస్తున్న గనులను సొంతం చేసుకునేందుకు గనుల శాఖ అధికారులను పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు మైనింగ్ నిర్వాహకులకు అధికారుల ద్వారా పరోక్ష హెచ్చరికలు కూడా వెళ్లినట్టు, ‘ఫలానా’ నేతలను ప్రసన్నం చేసుకుంటే మీకు ఇబ్బందులు ఉండవని అధికారులు వారికి సూచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. నిబంధనలను తుంగలోతొక్కి ఎక్కడా లేనివిధంగా కోట్లలో పెనాల్టీలు విధిస్తూ క్రషర్ల నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం అధికారుల వైఖరి మైనింగ్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఏ నిబంధన ప్రకారం ఇంత భారీస్థాయిలో పెనాల్టీలు విధిస్తున్నారో అధికారులు చెప్పడంలేదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రషర్లను లక్ష్యంగా చేసుకొని అధికారులు దాడులకు దిగుతున్నారని వాపోతున్నారు. క్రషర్లను మూసివేసి ‘తమ దారికి’ తెచ్చుకునేందుకే కనీవినీ ఎరుగని రీతిలో పెనాల్టీలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.