చేతిలో అధికారముంటే చేసేది తప్పయినా ధర్మమై పోతుంది! పేదోడి వైపు న్యాయమున్నా అది నేరంగా మారుతుంది! నిబంధనలు నీరుగారి.. చట్టాలు చట్టుబండలవుతాయి.. లేని అనుమతులు వాటంతటవే నడుచుకుంటూ వస్తాయి. ఇక్కడ ‘ముఖ్యనేత’ చేసిందే చట్టం.. రాసిందే న్యాయం!
అది ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న నియోపొలిస్ ప్రాంతం.. అక్కడ ఎలాంటి కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతి లేకున్నా.. ఏకంగా రూ.3 వేల కోట్ల విలుజేసే 17 ఎకరాల్లో క్రషర్కు హెచ్ఎండీఏ అనుమతులిచ్చింది. లీజు కింద ఎకరానికి ఏడాదికి రూ.17 కోట్ల చొప్పున మొత్తం రూ.290 కోట్ల దాకా ఫీజు తీసుకోవాల్సి ఉన్నా.. అసలు వసూలు చేస్తున్నదీ లేనిదీ దేవునికే ఎరుక! ఎందుకంటే ఆ క్రషర్ ‘ముఖ్యనేత’ బంధువుది గనుక!
ఇది మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదలు నివాసముండే హనుమాన్‌నగర్ బస్తీ.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. సర్వే నంబర్లు 322, 323, 324లో దాదాపు 50 ఏండ్ల నుంచీ నివాసం ఉంటున్న సుమారు 600 కుటుంబాలను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. ఎందుకంటే చుట్టూ విల్లాలు, హైరైజ్ భవనాలు ఉండటంతో ఇప్పుడు హనుమాన్‌నగర్ బస్తీ భూములకు విలువ పెరిగింది.. అంతే.. అక్కడ రియల్ ఎస్టేట్‌కు రంగం సిద్ధమైంది. అందుకు పేదలనే సర్కార్ సమిధలుగామారుస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘ప్రభుత్వం మనదైతే.. అడిగేవాడెవడు? అడ్డుకునేవాడెవడు?’ అనేది కాంగ్రెస్ సామెత అన్నట్టుగా పాలన సాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత తన బంధుగణానికి దోచిపెట్టడానికి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. నిబంధనలను తుంగలో తొక్కుతూ, అడ్డదారుల్లో ఇష్టారీతిన దోచిపెడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం, ఆయన బినామీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా స్టోన్‌క్రషర్లు ఏర్పాటు చేశారంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనేక ఆధారాలను సభ ముందుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పొంగులేటిని మించి ముఖ్యనేతే ఎక్కువగా కొల్లగొట్టారని క్రషర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నియోపొలిస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్’ క్రషర్ ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. దేశంలోనే అత్యధిక ధర పలికిన నియోపొలిస్ ప్రాంతంలో క్రషర్ ఏర్పాటు కోసం తన కుటుంబానికి రూ.మూడు వేల కోట్లకుపైగా విలువ చేసే 17 ఎకరాల భూమిని ముఖ్యనేత కేటాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ పలు ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. అయితే ఈ క్రషర్ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. ఏ రకంగా చూసినా క్రషర్ ఏర్పాటు చట్ట విరుద్ధమని, అయినా చాలా చాకచక్యంగా, చట్టానికి చిక్కకుండా అనుమతులు సాధించుకున్నారని ఆరోపిస్తున్నారు. సామాన్యులకు ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాని తరహాలో ప్రత్యేక అనుమతులు వచ్చాయని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం మొదలు ఇప్పటివరకు ఏ సంస్థకు కూడా ఇలాంటి మినహాయింపులు లభించలేదని స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టే ‘వడ్డించేవాడు మనవాడైతే..’ అనే సామెతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కి ఏర్పాటుచేసిన ఈ క్రషర్‌తో ముఖ్యనేత తన బంధువుల ద్వారా నెలకు రూ.2 కోట్లు దండుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

అనుమతులు ఇవ్వడమే తప్పు
నియోపొలిస్ ప్రాంతంలో క్రషర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమే తప్పు అని నిపుణులు చెప్తున్నారు. జీవో 470/2008 ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఏలాంటి క్రషర్లకు అనుమతి లేదు. కానీ భాగ్యలక్ష్మి మినరల్స్‌కు కేటాయించిన 17 ఎకరాల భూమి ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 760 మీటర్ల దూరంలో ఉన్నదని అంటున్నారు. అయినా కిలోమీటర్ నిబంధనను పట్టించుకోకుండా, నిపుణుల కమిటీ నివేదిక అంటూ అనుమతులు మంజూరు చేసినట్టు ఆరోపిస్తున్నారు. తాము కాలుష్యానికి సంబంధించిన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని అనుమతులు ఇవ్వొచ్చని చెప్పామని.. అక్కడ జోన్లు, ఇతర ప్రభుత్వ నిబంధనలకు తమ అనుమతులతో సంబంధంలేదని కాలుష్య నియంత్రణ మండలి చెప్తున్నది. జోనింగ్, రెగ్యులేషన్లకు సంబంధించి తామేమీ జోక్యం చేసుకోబోమంటూ వారు చెప్తుండటం గమనార్హం.
యేటా రూ.290 కోట్లు వసూలు చేస్తున్నారా?
భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌కు నియోపొలిస్‌లోని 17 ఎకరాలను హెచ్ఎండీఏ ఏ ప్రాతిపదికన కేటాయించిందనేది ఇప్పటికీ బయటికి రావడంలేదు. ఒకవేళ లీజుకు ఇచ్చారనుకుంటే.. లీజు మొత్తం ఎంతో హెచ్ఎండీఏ ప్రకటించలేదు. ఇక్కడ ఎకరం భూమిని రూ.170 కోట్లకు ప్రభుత్వం వేలంపాటలో అమ్మింది. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఎక్కడైనా హెచ్ఎండీఏ తన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తే ఆ భూమి విలువలో పదోవంతు ఏడాదికి లీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎకరానికి రూ.17 కోట్లు చొప్పున, 17 ఎకరాల భూమికి ఏడాదికి రూ.290 కోట్లను లీజుగా హెచ్ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండీఏ ఎంత మొత్తానికి లీజుకు ఇచ్చింది? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? అనే అంశంలో గోప్యత పాటిస్తున్నది. రూ.290 కోట్లు వసూలు చేస్తున్నారా? ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.
బహిరంగ ప్రకటన లేకుండానే..
హెచ్ఎండీఏ ఎక్కడైనా తన స్థలాలు, షాపింగ్కాంప్లెక్స్లను లీజుకు ఇవ్వాలనుకుంటే ముందుగా బహిరంగ ప్రకటన ఇవ్వాలి. ఎవరు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తారో వారికి లీజుకు ఇవ్వడమో, అమ్మడమో చేయాలి. నియోపొలిస్ వంటి ప్రాంతంలో క్రషర్ పెట్టడానికి హెచ్ఎండీఏ అవకాశం కల్పిస్తే అనేకమంది ఔత్సాహికులు ముందుకువస్తారు. తద్వారా హెచ్ఎండీఏకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్వే నంబర్లు-239, 240లోని ప్లాట్లు ‘పీ’, ‘క్యూ’ ప్లాట్లలోని 17 ఎకరాలు కీలకమైన ప్రాంతంలో ఉన్నది. ఈ రెండు ప్లాట్లకు మంచి రోడ్డు సౌకర్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ క్రషర్ ఏర్పాటుకు బహిరంగ ప్రకటన ఇస్తే అనేక సంస్థలు పోటీపడి దక్కించుకునే అవకాశం ఉన్నదని నిపుణలు చెప్తున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండానే భాగ్యలక్ష్మి సంస్థకు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు.
చట్టానికి చిక్కకుండా..
నియోపోలిస్‌లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌కు భూమి కేటాయింపు మొదలు అంతా వ్యూహాత్మకంగా పనిచేశారని, చట్టానికి దొరుకకుండా అడ్డదారుల్లో అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. నియోపొలిస్‌లోని 10 ఎకరాల్లో ఉన్న బౌల్డర్లను (రాళ్లను) క్రిషింగ్ చేయడానికి అనుమతి కోరుతూ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ 2024 సెప్టెంబర్ 11న కాలుష్య నియంత్రణ మండలికి (పీసీబీ) దరఖాస్తు చేసుకున్నది. దీనిపై పీసీబీ వేగంగా స్పందించి ఒక నివేదిక ఇవ్వాలని ‘ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్’ను ఆదేశించింది. ఆ ఇంజినీర్ అక్టోబర్ 5న ఒకసారి, 21న మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. అక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తూ పీసీబీకి నివేదిక ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్లోపు ఎలాంటి క్రషర్లను పెట్టేందుకు అనుమతిలేని విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇక్కడే ఆ ఇంజినీర్ ఒక ఉపాయాన్ని కూడా పొందుపరిచారు. ఒక నిపుణుల కమిటీని వేసి, వారి అభిప్రాయం ప్రకారం చేస్తే బాగుంటుందని సూచించారు.
పీసీబీ వెంటనే నవంబర్ 6వ తేదీన ఈ క్రషర్‌పై చర్చించడమే ప్రధాన ఎజెండాగా సీఎఫ్ఈ మీటింగ్ పెట్టింది. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా మూడు రోజుల్లోనే నవంబర్ 9వ తేదీన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నవంబర్ 12న క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. ఆ తర్వాత కేవలం ఆరు రోజులకే, అంటే నవంబర్ 18వ తేదీన నివేదిక ఇచ్చింది. తర్వాత నవంబర్ 26వ తేదీన జీపీఎస్ కో ఆర్డినేటర్లను కూడా ఫిక్స్ చేశారు. తొలుత 10 ఎకరాల పేరుతో వచ్చిన దరఖాస్తు.. ఆ తర్వాత 17 ఎకరాలకు మారింది. తర్వాత నవంబర్ 27న సీఎఫ్ఈ సమావేశం జరిగింది. అక్కడ అంతా ఓకే అనుకొని, న్యాయసలహా తీసుకుందామని నిర్ణయించారు. సలహా కోసం డిసెంబర్ 18న అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. ఏజీ నుంచి 2025 జనవరి 28న స్పందన వచ్చింది. అక్కడ మొబైల్ స్టోన్‌క్రషర్ పెట్టుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. దీంతో పీసీబీ ‘టెంపరరీ స్టాండలోన్ స్టోన్‌క్రషర్’కు అనుమతినిచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భారీ క్రషర్‌ను నిర్మించారు. గంటకు 500 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
చుట్టుపక్కల నుంచి రాళ్లు.. అక్రమంగా రెడీమిక్స్
నిబంధనల మేరకు ఈ ప్లాంటుకు నియోపొలిస్‌లో ఉన్న రాళ్లు (బౌల్డర్లు) మాత్రమే వాడుకోవాలి. కానీ రోజూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి, ఇక్కడ క్రషింగ్ చేసి అమ్ముతున్నారని స్థానికులు చెప్తున్నారు. దీంతోపాటు క్రషర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలన్నింటికీ వారి వద్దనే మెటీరియల్ కొనాలన్న నిబంధన కూడా పెట్టారని అంటున్నారు. రాయల్టీ విషయంలో కూడా భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌కు భారీగా మినహాయింపులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్నది. దీనిపైనా అధికారుల నుంచి సరైన వివరణ రావడంలేదు. నిబంధనల ప్రకారం క్రషర్ వద్ద రెడీమిక్స్ ప్లాంట్ పెట్టేందుకు అనుమతి లేదు. కానీ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ రెడీమిక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల ఉన్న నిర్మాణ సంస్థలన్నీ వారి వద్దనే రెడీమిక్స్ కొనాలని అనధికారికంగా ఆదేశాలు కూడా వెళ్లాయని సమాచారం. దీంతో నియోపొలిస్ పరిసర ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణం చేపట్టిన ప్రతీ రియల్ ఎస్టేట్ కంపెనీ వీరి వద్ద నుంచే స్టోన్‌క్రషింగ్ మెటీరియల్, రెడీమిక్స్లను కొంటున్నాయని చెప్తున్నారు. క్రషర్ వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా ఇప్పటివరకు అధికారులు నోరుమెదపడం లేదు.