హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఏపీలోని గన్నవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాత ంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశ ప్రజలు ఇంకా తాగునీరు, సాగునీటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం లేదని, ఏ పట్టణంలో చూసినా కరెంట్ కోతలేనని విమర్శించారు. దేశ ఆర్థిక స్థితిగతులపై కేంద్రానికి అసలు పట్టింపే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విభజన హామీలు నెరవేర్చని కేంద్రం
తెలుగు రాష్ర్టాలు విభజన తర్వాత ఎన్నో సమస్యలను ఎదురొంటున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్, విజయవాడ, వైజాగ్ మెట్రో రైలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేవాళ్లే లేరని మండిపడ్డారు.
తోటకు స్వాగతం
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి విజయవాడలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన మహా మృత్యుంజయ జప(దోష) విశ్వశాంతి మహాయాగం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజయవాడలో రాఘవయ్య సరిల్ దగ్గర వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు.
విఫల కాంగ్రెస్.. సఫల బీఆర్ఎస్
కేంద్రం దక్షిణాదిపై ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమను చూపుతున్నదని తోట చంద్రశేఖర్ మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ విస్తరిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సాధిస్తున్న అభివృద్ధి దేశానికే దిక్సూచిలా మారిందని వివరించారు. తెలంగాణ తరహా అభివృద్ధి అన్ని రాష్ర్టాల్లోనూ జరుగాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష పార్టీగా విఫలమైన కాంగ్రెస్ కొన్ని రాష్ర్టాలకే పరిమితమైందని, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ర్టాలకే పరిమితమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేశారని వివరించారు. ఏపీతోపాటు అన్ని రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్ విస్తరిస్తున్నదని, స్వశక్తితో దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా తన ధర్మాన్ని నెరవేర్చబోతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా తన గురుతర బాధ్యతను నెరవేర్చబోతున్నదని పేర్కొన్నారు.