రోడ్డెక్కుతున్న రైతులు.. నీళ్లిచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలురాష్ట్రమంతా విస్తారంగా వానలు.. పలు జిల్లాల్లో వరదలు.. అటు కృష్ణా, ఇటు గోదావరి బేసిన్లలో ఎగువనుంచి ముంచెత్తిన వరద.. ప్రాజెక్టుల్లో గరిష్ఠంగా ఇన్‌ఫ్లో.. ఇంత జలసమృద్ధితో కనీసం రెండు పంట సీజన్లకైనా సునాయాసంగా నీళ్లందించవచ్చు. కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్!ఉన్ననీటినీ ఒడిసి పట్టుకోలేని దైన్యం దానిది. పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని అశక్తత దానిది. ఫలితంగా చెరువుల్లో, చేన్లలో నీళ్లులేవు. కండ్లముందే పంటలు ఎండుతుంటే.. కోతకు ముందే పశువులకు మేతగా వదిలేస్తున్న దౌర్భాగ్యమిది! ఎవరి పాపమిది? ఎక్కడి శాపమిది?
Telangana | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆశాభావం వ్యక్తమైంది. ఆయకట్టుకు తగినంత నీరందుతుందని మురిసిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఎటుచూసినా పంటలు ఎండుతున్న దయనీయత కనిపిస్తున్నది. పంట చేతికి వచ్చిన తర్వాత గడ్డిని పశువుల మేతకు వేయాల్సింది పోయి.. వరి కోతలకు ముందే మూగజీవాల మేత కోసం పొలాల్లోకి తోలాల్సిన దుస్థితి దాపురించింది. మరి ఈ కరువెట్లా వచ్చింది? అంటే అది కాంగ్రెస్ తెచ్చింది! నీటి నిర్వహణకు తిలోదకాలిచ్చిన ఫలితమిది! ప్రభుత్వ ప్రణాళికలేమికి, సోయిలేని తీరుకు దర్పణమిది! సర్కారు వైఫల్యం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఇప్పుడు తండ్లాడాల్సి వస్తున్నది. వేలాది రూపాయల పెట్టుబడిపెట్టిన కర్షకలోకం ఇప్పుడు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నది.
కృష్ణ నుంచి సముద్రంలోకి 844 టీఎంసీలు
కృష్ణా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. బేసిన్‌లోని ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులూ పొంగి పొర్లాయి. గతేడాది కేవలం 72 టీఎంసీలే సముద్రంలో కలవగా, ఈసారి 844 టీఎంసీల మేరకు జలాలు సముద్రంలో కలిశాయి. అంటే ఎంత భారీగా వరదలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు! అదీగాక కృష్ణాలో నవంబర్ మొదటి వారం వరకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ర్టాలకు కలిపి 1010 పైగా టీఎంసీలు అందుబాటులోకి వచ్చాయి. తాత్కాలిక కోటాలో ఏపీకి 666 టీఎంసీలు కాగా, ఇప్పటికే ఆ రాష్ట్రం కోటాకు మించి జలాలను తరలించుకుపోయింది. మరోవైపు తెలంగాణకు తాత్కాలిక కోటాలో 344 టీఎంసీలు ఉండగా, ఇప్పటికీ 220 టీఎంసీలకు మించి వినియోగించలేదు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొన్నది. మరోవైపు ఇప్పటికీ రాష్ట్ర కోటాలో 124 టీఎంసీలు ఉన్నాయి. యాసంగి సాగునీటికి, వేసవి తాగునీటికి కలిపి మే నెలాఖరు వరకు దాదాపు 116 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ రిజర్వాయర్లు ఖాళీ కావడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం అందులో ఉన్న నీటిలోనూ ఏపీకి 20 టీఎంసీలు కేటాయించగా, తుదకు దక్కింది 40 టీఎంసీలు మాత్రమే. దీంతో అంచనాలన్నీ తప్పి ఆ ప్రాజెక్టుల కింద ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న దుస్థితి దాపురించింది. అదీగాక వేసవిలో తాగునీటికి తండ్లాక తప్పని పరిస్థితి నెలకొన్నది.
గోదావరిలో నుంచి 4150 టీఎంసీలు
మరోవైపు గోదావరి బేసిన్లోనూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి. 100 రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులతోపాటు, శ్రీరాంసాగర్ మొదలు అన్ని మేజర్ ప్రాజెక్టులే కాకుండా మీడియం ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఏడాది మొత్తంలో దాదాపు 4150 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. అక్టోబర్ 29 వరకు వరద ప్రవాహాలు భారీగా కొనసాగాయి. ఇప్పటికీ ప్రాణహితలో దాదాపు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి గోదావరిలో కొనసాగుతున్నది. అయినా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు సైతం ఎండుతున్నది. ఎస్సారెస్పీకి ఈ ఏడాది జూలై 17న నుంచి వరద ప్రవాహాలు నవంబర్ మొదటి వారం దాకా కొనసాగాయి. దాదాపు నాలుగు సార్లు గేట్లు తెరిచారు.
కొరవడిన ప్రణాళిక..
సమృద్ధిగా వర్షాలు కురిసినా రాష్ట్రంలో నీటి కటకట ఏర్పడడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలిసిపోతున్నది. గత బీఆర్ఎస్ సర్కారు సాగు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికబద్ధంగా ముందుకుపోయింది. తెలంగాణ నీటి వనరులకు ఆయువుపట్టయిన చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. తద్వారా రెండు పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నిరందిగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలోని వేలాది చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఇలా ప్రతి అక్టోబర్ లేదా డిసెంబర్లో చెరువులు, చెక్‌డ్యామ్‌లను క్రమం తప్పకుండా నింపేది. ఫలితంగా భూగర్భజలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్‌లను కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఆ పనేమీ చేయలేదు. ఫలితంగా భూగర్భజల మట్టాలు తీవ్రంగా పడిపోతున్నాయి. మరోవైపు కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తిస్థాయిలో నడవని దుస్థితి నెలకొన్నది. దీంతో కొన్నిచోట్ల నీళ్లు లేక పంటలు ఎండుతుంటే.. మరోవైపు నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయి. ఇది ప్రభుత్వ ప్రణాళికారాహిత్యమేనని స్పష్టంగా అర్థమవుతున్నది.
అధికారులు హెచ్చరించినా పెడచెవిన..
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, మిడ్‌మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటివారం నాటికి తాగునీటి అవసరాలు పోగా 354.88 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) లెక్కతేల్చింది. ఈ యాసంగిలో మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించింది. మేజర్ ప్రాజెక్టుల్లో 277.59 టీఎంసీలు అందుబాటులో ఉండగా, వాటి కింద 30.96 లక్షల ఎకరాలకు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 30.38 టీఎంసీలుంటే 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలు రూపొందించింది. వెట్క్రాప్స్కు 24.54 లక్షల ఎకరాలు, ఐడీ క్రాప్స్‌కు 17.94 లక్షల ఎకరాలు మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కమిటీ తైబందీ ఖరారు చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అంటే వారం విడిచి వారం మొత్తంగా 6 తడులను అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్‌లోని ఇంజినీర్లు మొదటినుంచీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు.
ఇదిలాఉంటే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి చేతులు దులుపుకొన్నదే తప్ప ఆ దిశగా నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించింది లేదు. కృష్ణా నదీ జలాల్లో ఏపీ తాత్కాలిక కోటా 512 టీఎంసీలే కానీ ఇప్పటివరకు ఏకంగా 650 టీఎంసీలను మళ్లించుకుపోయింది. నవంబర్ నుంచే శ్రీశైలం, సాగర్ల నుంచి భారీగా జలాలను మళ్లించడం మొదలు పెట్టింది. ఒకానొక దశలో గడచిన 25 రోజుల్లోనే ఏకంగా 60 టీఎంసీలను మళ్లించుకుపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! రోజుకు నికరంగా 2 టీఎంసీలకు మించి జలాలను ఏపీ మళ్లించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారా 8 నెలల్లోనే 245 టీఎంసీలకు పైగా జలాలను పెన్నా బేసిన్‌కు తరలించింది. ఏపీ జలాలను మళ్లిస్తున్న విషయాన్ని రాష్ట్ర అధికారులు నవంబర్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సర్కారు పెడచెవిన పెట్టింది. బోర్డును నిలదీసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. మరోవైపు మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో ఎస్సారెస్పీ-2తోపాటు, నిజాంసాగర్, రంగనాయకసాగర్ ఆయకట్టు సైతం ఎండిపోయే దుస్థితి వచ్చిపడింది.
రైతన్నల ఆగమాగం..
కాంగ్రెస్ సర్కారు అవగాహనా రాహిత్యం, ప్రణాళిక లేమితో ప్రస్తుతం రైతులు ఆగమవుతున్నారు. నీరిస్తామని పత్రికాముఖంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం పంటలు పొట్టకు వచ్చే దశలో చేతులెత్తేసింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చెరువులను నింపకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లన్నీ చిన్నబోతున్నాయి. వాటి కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండడంతో బోరు బావుల కింద వ్యవసాయం సజావుగా సాగని దుస్థితి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రైతులు పంటలపై ఆశలు వదులుకొని పశువుల మేతకు వదిలేశారు. ఎకరాన దాదాపు 20-25 వేల పెట్టుబడి పెట్టిన రైతులు ప్రస్తుతం పంటలను కాపాడుకొనేందుకు రోడ్డెక్కుతున్నారు. ట్యాంకర్లను పెట్టి కొద్దిమొత్తంలోనైనా పంటను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు. వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీ!గోదావరి, కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతోపాటు పొంగిపొర్లాయి. అక్టోబర్ 25 నాటికి సైతం శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా 215 టీఎంసీలతో కళకళలాడింది.
కానీ ప్రస్తుతం 74.81 టీఎంసీలకు చేరుకొని అడుగంటింది. వేసవి రాకముందే నీటినిల్వలన్నీ అడుగంటి పోయాయి. ఇంకా యాసంగి మధ్యలో ఉండగానే శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు ఖాళీ అయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ను ఏపీ సర్కారు ఖాళీ చేసింది. వాస్తవ డెడ్ స్టోరేజీ 834 అడుగులు కాగా, ఈ సీజన్లో 820గా నిర్ధారించారు. అయినా ప్రస్తుతం అక్కడ కేవలం 28 టీఎంసీలే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. రిజర్వాయర్‌పై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు మొత్తంగా 7 జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. యాసంగి అవసరాలను కూడా తీర్చాల్సి ఉన్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ఈ ఏడాది 515 ఫీట్లుగా నిర్ధారించారు. అక్కడ ప్రస్తుతం 34 టీఎంసీలు కూడా లేని దుస్థితి నెలకొన్నది. రెండు రిజర్వాయర్లలో కలిపి నికరంగా 60 టీఎంసీలు కూడా అందుబాటులో లేవు. జూరాల, గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కడెం తదితర ప్రాజెక్టులన్నీ అండుగంటుతున్నాయి. మరోవైపు సాగర్ ఎడమ కాలువ కింద 6.50 లక్షల ఆయకట్టుతోపాటు, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నది. కానీ రెండు రిజర్వాయర్లు ఖాళీ అవడంతో ప్రస్తుతం ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
వర్షపాతం