కుభీర్, మే 27 : యాసంగిలో సాగు చేసిన సెనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంట కోతలు దాదాపుగా ముగియడంతో రైతులు రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు పంట వ్యర్థాలకు నిప్పుపెట్టడం.. ధాన్యం బస్తాలకు మంటలంటుకోవడం వంటి సంఘటనలు చూశాం. అయితే.. పంట కొయ్యలను కాల్చకుండా.. కలియదున్నడం ద్వారా నేల సారవంతమవుతుందని అంటున్నారు వ్యవసాయ నిపుణులు.
మామూలుగా రైతులు కోత యంత్రాల ద్వారా మొక్కజొన్న జొన్న పంటలను నేల మట్టం వరకు కోయకుండా మూడు ఫీట్ల పైనుండి నూర్పిడి చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు కూలీల ద్వారా కోయించడంతో ఫీటన్నర కొయ్యలు ఉంటున్నాయి. పంట నూర్పిడి అనంతరం అవశేషాలు(తుక్కు)కు నిప్పు పెట్టి కాల్చి వేస్తున్నారు. పంట కొయ్యలను కాల్చవద్దని అధికారుల నుంచి రైతులకు ఎలాంటి సూచన సలహాలు అందకపోవడం, చాలామందిలో అవగాహన లేమి కారణంగా భూసారం చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అయినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించక పోవడం విడ్డూరం.
పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం ద్వారా భూమిలోని సారం దెబ్బతిని ప్రతి ఏటా దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దిగుబడులు తగ్గడానికి రైతులు పంట అవశేషాలను కాల్చడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట ఎదుగుదలకు ఉపయోగపడే నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు బూడిదవడంతో పైరుపై తెగుళ్ల బెడద అధికం అవుతుందని, వాయు కాలుష్యంతోను రైతులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

అంతేకాకుండా నేలపై ఉండే సేంద్రియ పదార్థం తగ్గిపోయి నీళ్లలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్రజని, గంధకం లాంటి పోషకాలు గాలిలో కలిసిపోతున్నాయని, కొయ్యలతో పాటు పంట విశేషాలను కలియదున్ని రోటోవేటర్తో చదును చేయడం ద్వారా వేస్టేజీ భూమిలో మురిగిపోయి ఎరువుగా మారుతుందని వారు రైతులకు చెబుతున్నారు. తద్వారా నేల భూసారం పెరిగి తర్వాతి పంటకు బాగా ఉపయోగపడనుందని పేర్కొంటున్నారు.
రైతులు ప్రధానంగా కోతల సమయంలోనే జాగ్రత్త పడాలి. యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తే కొయ్యలను నేలమట్టం నుండి కోసే విధంగా చూడాలి. కూలీల ద్వారా కోత వేస్తే వారికి నేలమట్టం నుండి కోత వేయాలని ముందే సూచించాలి. పంట అవశేషాలను కాల్చడం ద్వారా భూసారం తగ్గిపోయి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. కొయ్యలతో పాటు తుక్కును దున్నే ముందు ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్పెట్ దుక్కిలో చల్లి కలియ దున్నితే భూసారం పెరిగి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏఈ ల ద్వారా ప్రతి గ్రామంలో ఈ విషయమై రైతులకు అవగాహన కల్పిస్తాం.
– సారిక, మండల వ్యవసాయాధికారిణి, కుభీర్
గ్రామాలలో ఏఈఓల ద్వారా పంట వ్యర్థాల నిర్వహణ అంశంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో రబీ సాధారణ సాగు 32,200 ఎకరాల్లో ప్రధాన పంటలైన శనగ మొక్కజొన్న, జొన్న పంటలను 13వేల 74 మంది రైతులు సాగు చేశారు. ప్రతిసారి పంట అవశేషాలను కాల్చివేయడం ద్వారా భూమిలోని సారం దెబ్బతిని దిగుబడుల కోసం ఏటా రసాయనిక ఎరువులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
దాంతో ఆర్థిక భారం పెరిగి రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులు సాగు చేసే పంటలపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ స్థాయిలో ఏఈఓలను నియమించి ప్రతి క్లస్టర్లో రైతు వేదికలను నిర్మించింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యతను మరిచింది. వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఒక్క రైతుకు సూచనలు సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.